అమరావతి శంకుస్థాపనకు రండి

అమరావతి శంకుస్థాపనకు రండి - Sakshi


జపాన్ ప్రధానిని ఆహ్వానించిన చంద్రబాబు

రెండో రోజు జపాన్ పర్యటనలోపలువురు ప్రతినిధులతో భేటీ


 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమయ్యారు. అక్టోబర్ 22న జరిగే రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా అబేను చంద్రబాబు ఆహ్వానించారు. అంతకు ముందు ఆయన జపాన్ చీఫ్ కేబినెట్ కార్యదర్శి యొషిహిడే సుగను కలిశారు. అనంతరం ఆయన టోక్యోలో విలేకరులతో మాట్లాడుతూ జపాన్ నుంచి పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా తాను ఇక్కడ పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఏపీ నూతన రాజధాని శంకుస్థాపనకు తమ దే శ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని, జపాన్, సింగపూర్ ప్రధానులను కూడా ఆహ్వానిస్తున్నామని, ముగ్గురూ హాజరైతే అదో అద్భుత ఘట్టమవుతుందన్నారు. ఆయన పర్యటన రెండో రోజు మంగళవారం పలు కంపెనీలు, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం...

 ళీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని చంద్రబాబు కోరగా వీలు చూసుకుని వస్తానని అబే చెప్పారు. ఈ సందర్భంగా అబేకు తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదం, శేషవస్త్రం, జ్ఞాపికను చంద్రబాబు బహూకరించారు.



►జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి యోచి మియజవాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇందులో భాగస్వామి కావాల్సిందిగా తమ దేశ సంస్థ నెడోను కోరతామని, ఆ సంస్థ అధ్యయనం చేస్తుందని, సుమిటోమి సంస్థకు సహకరిస్తుందని మియజావ వివరించారు. రాజధాని శంకుస్థాపనకు రావాలని మియజవాను చంద్రబాబు ఆహ్వానించారు.



► రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు తప్పక సహకారం అందిస్తామని జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజం మంత్రి అఖిహిరో ఒహతాతోను కలిసిన సందర్భంగా చంద్రబాబుకు చెప్పారు.



► మిజుహో బ్యాంకు అంతర్జాతీయ విభాగం అధిపతి సుఫిమి సకాయ్ బృందంతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకుతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని అమరావతిలో బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు కోరారు.



► సాఫ్ట్‌బ్యాంక్ ఛైర్మన్ మసయోషి సోన్‌తో జరిగిన సమావేశంలో మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సోలార్ ప్యానళ్ల తయారీ కేంద్రాన్ని, 20 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని సోన్ చెప్పారు.



►బ్యాంక్ ఆఫ్ టోక్యో, మిత్సుబిషి బృందాలను కలిసినప్పుడు ఏపీ రాజధానిలో శాఖలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రత్యేకించి విదేశీ మారక ద్రవ్య విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంక్ ఆఫ్ టోక్కో బృందానికి విజ్ఞప్తి చేశారు.



► నేషనల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ టకాయుకి మోరిటా బృందంతో చంద్రబాబు బృందం సమావేశమైంది. సైబర్ సెక్యూరిటీ, రోడ్డు రవాణా వ్యవస్థ, బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీ తదితర అంశాల్లో ఏపీకి సహకారం అందించేందుకు ఎన్‌ఈసీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు.



►తెలుగు కమ్యూనిటీ ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు లేవని, కావాలని కొందరు సృష్టిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తోందని, అందులో జపాన్, చైనా, సింగపూర్, ఆస్ట్రేలియాల్లో స్థిరపడిన, ఉద్యోగాలు చేసుకుంటున్న ఏపీ వారిని సభ్యులుగా నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జపాన్‌లో ఎల్‌అండ్‌టీ కంపెనీ తరఫున విధులు నిర్వహిస్తున్న రాము అనే వ్యక్తిని జపాన్‌లో ఏపీ డెస్క్ బాధ్యుడిగా నియమించారు.



►చంద్రబాబు వెంట పర్యటనలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top