హామీల అమలుకు ఇచ్చే నిధులే ప్యాకేజీయా!

హామీల  అమలుకు ఇచ్చే నిధులే ప్యాకేజీయా! - Sakshi


చంద్రబాబు అసమర్థత వల్లే హోదా రావడం లేదు

వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ


 

 హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన హామీల అమలుకు కేంద్రం ఇచ్చే నిధులను ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడ డం విడ్డూరమని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్యాకేజీ అనేది రాష్ట్ర ప్రజల హక్కు, కేంద్రం ఇచ్చి తీరాల్సిన అంశమని చెప్పారు. కానీ, ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని బొత్స స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇంకా గట్టిగా పోరాడుతామన్నారు. చంద్రబాబు అసమర్థత, స్వార్థ ప్రయోజనాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు.



తాము మాత్రం వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హోదా కోసం గట్టిగా పోరాటం చేయాల్సింది పోయి తాము చేస్తున్న బంద్‌ను విఫలం చేసే కుతంత్రాలకు సీఎం పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రయోజనం లేదని బిహార్ సీఎం నితీష్‌కుమార్ చెప్పారని గుర్తుచేశారు. రాజధాని భూముల సేకరణ విషయంలో మంత్రి నారాయణ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. సీఎంకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారన్నారు. 22 మంది సబ్ కలెక్టర్లను భూసేకరణకు నియమించే విషయంలో సీఎంకు తెలియకుండా ఆదేశాలు జారీ అవుతాయా? అని బొత్స ప్రశ్నించారు.



 అణచివేతతో పంతం పెరిగింది: ఉమ్మారెడ్డి

 చంద్రబాబు ప్రభుత్వం బంద్‌పై అణచివేత వైఖరికి దిగడంతో ప్రజల్లో పట్టుదల, పంతం పెరిగాయని, వారంతా రోడ్లపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. బంద్‌ను విఫలం చేయడానికి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డారని విమర్శించారు. 15 నెలలుగా ప్రత్యేక హోదా సాధించలేకపోయిన సీఎం ప్రజా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూడటం పూర్తి అవివేకమన్నారు. బంద్ రోజున ప్రజల తమ సత్తా చాటారని, చంద్రబాబు దీన్ని గ్రహించాలని హితవు పలికారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top