ఈ మౌనం ఖరీదు రూ.2000 కోట్లు

ఈ మౌనం ఖరీదు రూ.2000 కోట్లు - Sakshi


పార్టీకి, ప్రభుత్వానికి ప్లస్ అవుతుందనుకుంటే ఎంతసేపైనా మాట్లాడతారు..

ప్రజలకు మైనస్ అవుతోందని తెలిసినా పాలకులు మౌనంగా ఉంటున్నారు.

మేధావుల మౌనంతో సమాజంలో చైతన్యం చిన్నబోతుంది...

అదే పాలకులు మౌనంగా ఉంటే అభివృద్ధే ఆగిపోతుంది.

అభివృద్ధిలో అగ్రగాములుగా నిలిచేందుకు సున్నా నుంచి మొదలుపెట్టామని చెబుతున్నా

ఆ దిశగా సాగేందుకు అందివచ్చిన అవకాశాలను జారవిడుచుకుంటూ మౌనంగా ఉంటున్నారెందుకు?



ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారాన్ని చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన మాటలకు.. చేతలకు పొంతనే లేకపోతే ఎలా? స్మార్ట్ సిటీల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ ప్రగల్భాలే అనుకోవాల్సి వస్తోంది. రాష్ట్రానికి 14 స్మార్ట్ సిటీలను తెస్తామన్నారు. అంత కాకపోయినా మన జనాభా ప్రాతిపదికన కనీసం 7 స్మార్ట్ సిటీలు రావాలి. అయితే కేంద్రం 4 స్మార్ట్ సిటీలను ఇచ్చేందుకు ముందు సిద్ధమైంది. తీరా ప్రకటించే నాటికి 3 మాత్రమే దక్కాయి. కార్యరూపం దాలిస్తే కనీసం ఒక్కటైనా మిగులుతుందో? లేదో?



సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, పట్ణణ జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనిష్ఠంగా 12 స్మార్ట్ సిటీలను కేటాయించాలి. వాటిల్లో నవ్యాంధ్రకు కనీసం ఏడింటిని మంజూరు చేయాలి. కానీ.. రాష్ట్రానికి కేంద్రం మూడింటిని మాత్రమే కేటాయించింది. స్మార్ట్ సిటీల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉలకడం లేదు.. పలకడం లేదు. మొదట్లో స్మార్ట్ సిటీలపై ఊదరగొట్టిన చంద్రబాబు ప్రస్తుతం వాటి ఊసేత్తడం లేదు. కేంద్రం వివక్ష వల్ల రాష్ట్రం కనిష్ఠంగా రూ.2వేల కోట్లకు పైగా నష్టపోతోంది.



రాష్ట్రంఎలా నష్టపోయిందంటే?

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం, రాష్ట్రం 25 శాతం, సంబంధిత నగర, పురపాలక సంస్థ 25 శాతం నిధులను వెచ్చించాలి. కేంద్రం తొలి ఏడాది రూ.200 కోట్లు.. ఆ తర్వాత మూడేళ్లపాటూ ఒక్కో స్మార్ట్ సిటీకి  ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున విడుదల చేస్తుంది. అంటే ఒక్కో స్మార్ట్ సిటీకి నాలుగేళ్లలో రూ.500 కోట్లను కేంద్రం విడుదల చేస్తుందన్న మాట!  ఈ లెక్కన కేంద్రం నుంచి రాష్ట్రం రూ.రెండు వేల కోట్లకుపైగా నిధులను కోల్పోవడమే కాకుండా అనేక నగరాలు అభివృద్ధికి దూరమవుతాయి.



ముందుగా తెలిసే దాటవేత!

దేశవ్యాప్తంగా వంద స్మార్ట్‌సిటీలను ఎంపిక చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీకి మూడు మెగా సిటీలతోపాటు 14 స్మార్ట్ సిటీలను సాధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో విజయవాడ, కర్నూలు, గుంటూరు, చిత్తూరులను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిందంటూ తొమ్మిది నెలల క్రితమే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. అప్పటి నుంచే స్మార్ట్ సిటీ, మెగా సిటీ జపాన్ని ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే ‘స్మార్ట్ సిటీ మిషన్’ప్రారంభించే సమయానికి నాలుగు కాదు కదా.. మూడింటినే కేటాయించి, కేంద్రం చేతులు దులుపుకుంది.



కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా...

కేంద్రంలో భాగస్వామి పార్టీగా కొనసాగుతూ కూడా స్మార్‌‌ట సిటీల విషయంలో ఏపీ ప్రజలకు నష్టం కలుగుతున్నా చూస్తూ ఉండిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత నీరుగార్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక చేసిన వాగ్దానాలనూ పక్కన పెట్టారనడానికి ఇదో ఉదాహరణ.



‘స్మార్ట్’కు పది ప్రమాణాలు

1. ప్రజలకు అవసరమైన మేరకు నీటి సరఫరా

2. నిరంతర విద్యుత్ సరఫరా

3. ఘన వ్యర్థాల నిర్వహణతో కూడిన పారిశుద్ధ్యం

4. ట్రా‘ఫికర్’లేని రవాణా వ్యవస్థ

5. అందరికీ పక్కా ఇళ్లు

6. డిజిటలైజేషన్, వంద శాతం ఐటీ కనెక్టవిటీ

7.ప్రజల భాగస్వామ్యంతో ఈ-గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్‌

8. పరిశుభ్రమైన వాతావారణం

9. ప్రజలకు ప్రధానంగా మహిళలు, పిల్లలకు భద్రత

10. మెరుగైన విద్య, వైద్యం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top