ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్‌...

ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్‌... - Sakshi


క్రీడాకారులకు ఏపీ సీఎం ఆఫర్‌

♦ చంద్రబాబు ప్రకటనపై సోషల్‌ మీడియాలో జోకులు

♦ ఒలింపిక్స్‌కు, నోబెల్‌కు ముడిపెట్టడంపై విస్మయం

♦ ప్రతిష్టాత్మక పురస్కారాన్నితానే ఇస్తాననడంపై ఆశ్చర్యం

♦ విజయవాడలో షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు సన్మానం..గ్రూపు–1 ఉద్యోగం ఇస్తామన్న బాబు




విజయవాడ స్పోర్ట్స్‌

‘‘న పిల్లలు ఒలింపిక్‌ క్రీడల్లో గెలవాలి. విజయం సాధించే వరకూ గట్టిగా ప్రాక్టీస్‌ చేయాలి. మొదటి స్థానంలో వస్తే నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తానని ఇటీవలే నేను అనౌన్స్‌ కూడా చేశాను. ఒలింపిక్స్‌లో గెలిచిన తర్వాత నీకు(కిడాంబి శ్రీకాంత్‌) ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ, నా ఆశయం. తప్పకుండా సాధించి తీరాలని కోరుతున్నా’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ సన్మాన సభలో చంద్రబాబు ఇచ్చిన ఈ ఆఫర్‌ అందరినీ  విస్మయానికి గురిచేసింది.


ఒలింపిక్‌ క్రీడలకు, నోబెల్‌ ప్రైజ్‌కు ముడిపెట్టిన ముఖ్యమంత్రి పరిజ్ఞానంపై సోషల్‌ మీడియాలో జోకులు బాగానే పేలుతున్నాయి. పైగా ఆ ప్రైజ్‌ తానే ఇస్తానని సీఎం చెప్పడం గమనార్హం. ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాన్ని ఎవరు పడితే వారు ఇచ్చుకుంటూ పోలేరు. విజేతలను నోబెల్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ పురస్కారాన్ని క్రీడాకారులకు ఇవ్వరు. ఇవేవీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు ఒలింపిక్స్‌లో గెలిచిన వారిని నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తానని ప్రకటించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడడం ఏమిటోనని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



నేను స్థలం ఇవ్వడం వల్లే...

‘‘చదువుకుంటే కేవలం ఉద్యోగంతో జీవితంలో స్థిరపడతారు. అదే క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటే మంచి ఆరోగ్యంతోపాటు జీవితంలో స్థిరపడతారు. సమాజం, ప్రభుత్వాలు గుర్తిస్తాయి. ఇందుకు కిదాంబి శ్రీకాంతే మంచి ఉదాహరణ. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మరింత మంది క్రీడాకారులు తయారు కావాలి’’ అని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడల్లో రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచస్థాయిలో చాటిచెప్పే వారికి నగదు పారితోషికం, గ్రూపు–1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుల్లెల గోపీచంద్‌కు అకాడమీ నిర్వహణకు స్థలం కేటాయించినందు వల్లే నేడు మెరికల్లాంటి పీవీ సింధు, శ్రీకాంత్, సైనాలు పుట్టుకొచ్చారని చెప్పారు.



పుల్లెల గోపీచంద్‌కు రూ.15 లక్షలు

ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించిన శ్రీకాంత్‌పై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కిదాంబి శ్రీకాంత్‌ సన్మాన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాంత్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు కిదాంబి రాధాముకుందా, కృష్ణను సన్మానించారు. శ్రీకాంత్‌కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఆయనకు గుంటూరులో 1,000 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇండేన్‌ అయిల్‌ కార్పోరేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉన్న శ్రీకాంత్‌కు ఇష్టమైతే, అది వదిలేసి వస్తే రాష్ట్రంలో గ్రూపు–1 ఆఫీసర్‌ పోస్టును ఇస్తామని తెలిపారు. శ్రీకాంత్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు రూ.15 లక్షల నజరానా ప్రకటించారు.






చంద్రబాబుకు రాకెట్‌ బహుకరించిన శ్రీకాంత్‌

గోపీచంద్‌ అకాడమీ వల్లే తాను ఈ రోజు ఇంతటి స్థాయిలో ఉన్నానని కిడాంబి శ్రీకాంత్‌ అన్నారు. సీఎం చంద్రబాబు కృషి, కోచ్‌ గోపీచంద్‌ శ్రమతోనే అకాడమీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ విదేశాల నుంచి తెచ్చిన యోనెక్స్‌ కంపెనీ రాకెట్‌ను సీఎం చంద్రబాబుకు బహూకరించారు. అనంతరం వేదికపై సీఎం చంద్రబాబుతో కొద్దిసేపు సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడి అలరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, మేయర్‌ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి కేసీహెచ్‌ పున్నయ్య చౌదరి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు కృష్ణ, రాధాముకుందా, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top