మంత్రులు డమ్మీలే

మంత్రులు డమ్మీలే - Sakshi


చంద్రబాబు వేసిన ఉచ్చుకు జిల్లా మంత్రులు చిక్కారు. కీలకమైన విశాఖ జిల్లాపై ఆధిపత్యం ఉండాలని... తన కుటుంబసభ్యులు, సన్నిహితుల పరోక్షపాలన సాగేదిశగా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నల మధ్య ఆధిపత్య పోరుకు అవకాశం కల్పించి వారు నువ్వెంత అంటే నువ్వెంత అన్న పరిస్థితిని తీసుకువచ్చారు. ఆ పరిస్థితినే అవకాశంగా తీసుకుని వారిద్దరినీ డమ్మీలను చేసేశారు.  విశాఖ సంగతి తాను చూసుకుంటానని ప్రకటించేశారు. ఈ పరిణామాలు మంత్రులు గంటా, అయ్యన్నలను హతాశులను చేశాయి. వారి వర్గీయులూ చతికిలపడిపోయారు.



సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విశాఖపట్నం కీలకం కానుందని సీఎం గ్రహించారు. భారీస్థాయిలో రానున్న ప్రాజెక్టులు, బాక్సైట్ గనులు, మెట్రోరైల్, పీసీపీఐఆర్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లానే వేదిక కానుంది. అందుకే ఈ జిల్లాలో  ప్రతి వ్యవహారం తన కనుసన్నల్లోనే సాగాలన్నది ఆయన ఉద్దేశం. తొలిసారి జిల్లా పర్యటనలోనే  వేలకోట్ల విలువైన బాక్సైట్ గనులను తవ్వుతామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. కీలకమైన ‘వుడా’కు కూడా చైర్మన్‌నుగానీ ఇతర నామినేటెడ్‌పాలకవర్గ సభ్యులనుగానీ నియమించకూడదని నిర్ణయించుకున్నారు.



‘వుడా’ పరిధిని విసృ్లతపరచి వీఎండీయే’గా తీర్చిదిద్ది చైర్మన్‌గా ఉంటానన్నారు. పూర్తిగా తన మనిషి అయిన మంత్రి నారాయణకు కీలకమైన పురపాలక శాఖను కేటాయించి ఆయన ద్వారా కథ నడిపిస్తున్నారు. జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు జిల్లా వ్యవహారాల్లో  పెద్దరికం ఉండాలని కోరుకోవడం సహజం. అధికారులు కూడా వారి మాటకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సీఎం ఏమాత్రం సుముఖంగా లేరు. వ్యూహాత్మకంగా ఆయన ఏం చేశారంటే...



మంత్రుల మధ్య చిచ్చుపెట్టి...

జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నల దీర్ఘకాల వైరాన్ని చంద్రబాబు అనుకూలంగా మలచుకున్నారు. జీవీఎంసీ పరిధిలో గంటా, రూరల్‌జిల్లాలో అయ్యన్నలదే పెద్దరికమన్నారు. కానీ గంటా, అయ్యన్నలు ఒకరి సామ్రాజ్యంలోకి ఒకరు చొచ్చుకువచ్చేలా చేస్తూ వారిమధ్య ఆధిపత్యపోరు రగలిస్తూనే ఉన్నారు. అయ్యన్న సొంత నియోజకవర్గం నర్సీపట్నంలోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు ఇవ్వడంలో మంత్రి గంటాకు అనుకూలంగా వ్యవహారం సాగింది. దీనిపై అయ్యన్న భగ్గుమన్నారు.



రూరల్‌జిల్లా పరిధిలోని ఎంపీ అవంతీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బండారు, రాజు, అనిత, పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్ తదితరులు గంటా వర్గంగా కొనసాగుతూ వచ్చారు. జీవీఎంసీ పరిధిలోని వెలగపూడి రామకృష్ణ పూర్తిగా అయ్యన్న వర్గీయుడిగా ముద్రపడగా ఇతర ఎమ్మెల్యేలు కూడా గంటాకు ఆమడదూరంలో ఉంటూ వస్తున్నారు. ఈ ఆదిపత్య పోరు ‘ఆర్డీవోల బదిలీ’ వ్యవహారంతో పరిస్థితి తెగేవరకు సాగింది. ఇదే అదనుగా చంద్రబాబు తన వ్యూహాన్ని చాపకింద నీరులా అమలు చేసేశారు.



అదేమిటంటే...మంత్రులు కాదు సర్వం నేనే

బదిలీలపై మంత్రులు గంటా, అయ్యన్నకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. తర్వాత మనసులోని మాటను చల్లగా చెప్పారు. ఇక నుంచి జిల్లా వ్యవహారాలను స్వయంగా చూసుకుంటానని తేల్చేశారు. అంతేకాదు సోమవారం జిల్లా పర్యటనలో అదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా అధికారులకు కర్తవ్య బోధ చేశారు. అంటే ఇక నుంచి అధికారులు మంత్రులను పట్టించుకోవాల్సి అవసరం లేదని సంకేతాలు ఇచ్చేశారు. తానుగానీ తాను చెప్పిన వ్యక్తులే జిల్లా పాలనా వ్యవహారాలను చూస్తారని చంద్రబాబు స్పష్టం చేసినట్లైంది.



జిల్లాలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, ఇతర ప్రధాన పోస్టింగుల విషయంలో మంత్రులు జోక్యం  చేసుకోవడానికి వీల్లేదు. సీఎం చైర్మన్‌గా ఏర్పాటుకానున్న వీఎండీయే పూర్తిగా ఆయన సన్నిహితులైన ఉన్నతాధికారులతో నిండిపోనుంది. ఇప్పటికే చంద్రబాబు కుటుంబసభ్యులు, సన్నిహితులు తమ అనుకూల అధికారుల పేర్లను సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది.  దాంతో జిల్లా పూర్తిగా సీఎం సొంత మనుషుల పెత్తనం కిందకు రానుంది.



మంత్రులు చెప్పినదానితో నిమిత్తంలేకుండా అధికారులు నేరుగా సీఎం కార్యాలయాన్ని సంప్రదిస్తారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా  మంత్రుల వెంట తిరిగే కంటే నేరుగా ఉన్నతాధికారులతోనే వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చేస్తారు. ఫలితం...జిల్లాలో మంత్రులు గంటా, అయ్యన్నలు జిల్లాపై ఎలాంటి ఆధిపత్యం లేకుండా డమ్మీలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top