విద్యార్థులు ఇంటికి.. బస్సులు బాబు సభకు!


 శ్రీకాకుళం: ‘ముఖ్యమంత్రి వస్తున్నారు. జనాన్ని తరలించాలి.. మీ స్కూలు బస్సులను మాకప్పగించండి.. అవసరమైతే విద్యాసంస్థలకు ఈ రెండు రోజులు సెలవులిచ్చేయండి.. తర్వాత వచ్చే సెలవు రోజుల్లో క్లాసులు పెట్టుకోండి’.. ప్రైవేట్ విద్యాసంస్థలకు రవాణా శాఖ జారీ చేసిన హుకుం..! రెండు రోజుల పర్యటనకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సభలకు జనాన్ని తరలించే బాధ్యత అధికారులకు అప్పగించడంతో రవాణా శాఖ అధికారులు విద్యార్థుల కోసం బస్సులు నడుపుతున్న పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించారు.

 

 వాహనాలను అప్పగించాలని ఆదేశించారు. బస్సులు అప్పగిస్తే తమ విద్యార్థుల రాకపోకలు కష్టమవుతాయని యాజమాన్యాలు చెప్పగా.. కావాలంటే రెండు రోజులు సెలవులు ఇచ్చుకోవాలని సలహా ఇవ్వడమే కాకుండా విద్యాశాఖ అధికారి ద్వారా ఆదేశాలు కూడా జారీ చేయించారు. ఈ రెండు పనిదినాలకు బదులు ఇతర సెలవు రోజుల్లో పనిచేయాలని కూడా సంబంధిత కళాశాలలు, పాఠశాలలకు సూచించారు. ముఖ్యమంత్రి స్థాయి నేతలు వచ్చినప్పుడు జనసమీకరణకు వాహనాలు సమకూర్చుకోవడం కొత్త కాకపోయినా.. దాని కోసం ఏకంగా ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం దారుణం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అధికారులే ఈ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు బస్సులను తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

 

 గతంలో ప్రముఖులు పర్యటనలకు వచ్చినప్పుడు ఆర్టీసీ వాహనాలను సమకూర్చుకునే వారే తప్ప ప్రైవేటు వాహనాల జోలికి అంతగా వెళ్లేవారు కాదు. ఈ దఫా ఇటువంటి విధానానికి తెరలేపడం పట్ల ఆక్షేపణలు విన్పిస్తున్నాయి.  ఈ విషయాన్ని  ఉప రవాణా శాఖ కమిషనర్(డీటీసీ) వెంకటేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బస్సులు ఇవ్వాలని అడిగి మాట వాస్తవమేనని చెప్పారు. సెలవు విషయం తనకు తెలియదని, విద్యాశాఖాధికారిని అడగాలని సూచించారు. విద్యాశాఖాధికారి అరుణకుమారి వద్ద సెలవు విషయాన్ని ప్రస్తావించగా రెండు రోజులు సెలవు ఇవ్వాలని చెప్పడం నిజమేనన్నారు. ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి సెలవులు ఇవ్వవచ్చునని చెప్పారు. వాటికి ప్రత్యామ్నాయంగా వేరొక రోజున పనిచేయవచ్చని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top