చంద్రబాబు జపాన్ పర్యటన

చంద్రబాబు జపాన్ పర్యటన - Sakshi


సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ నెల 23 నుంచి 29 వరకు జపాన్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన వివరాలను ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది.



24వ తేదీ: మధ్యాహ్నం 2.50 గంటలకు జపాన్ లోని క్యోటోకు చేరుకుని అక్కడి హోటల్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం వ్యవసాయ యంత్రాలు, పరికరాల వ్యాపారం ఎండీ, జనరల్ మేనేజర్ నౌకి కొబియాషితో సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ ఎన్‌ఐడీఈసీ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. అనంతరం వారిచ్చే విందులో చంద్రబాబు పాల్గొంటారు.



25వ తేదీ: కడోమా నగరంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ పానాసోనిక్ కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శిస్తుంది. అనంతరం ఒసాకా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో కన్సాయ్ ఎలక్ట్రానిక్ ఫెడరేషన్, ఒసాకా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జెట్రో ఒసాకా ప్రతినిధులతో భేటీ అవుతారు. అదేవిధంగా ఇండియా ఐటీ ఫోరం, క్యోటో మేయర్‌లతో చంద్రబాబు భేటీ అవుతారు. తర్వాత అడ్వాన్స్‌డ్ కెమికల్ టెక్నాలజీని సందర్శిస్తారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు బృందం ఫ్యుకువోకా చేరుకుంటుంది.



26వ తేదీ: ఫ్యుకువోకాలోని న కటా వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని, అనంతరం అక్కడి టవర్‌ను సందర్శిస్తారు. ఎక్రోస్‌లో వైస్ గవర్నర్, వైస్ మేయర్‌లతో విందులో పాల్గొంటారు. అనంతరం శాన్ నో లోని వరద నియంత్రణ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. ఫ్యుజీ ఎలక్ట్రానిక్స్‌లోని స్మార్ట్ గ్రిడ్ కమ్యూనిటీని, కిటక్యుషు నగర కార్యాలయాన్ని సందర్శిస్తారు. పర్యావరణ విధానంపై జరిగే ప్రజంటేషన్‌లో పాల్గొంటారు. రాత్రికి రాజధాని టోక్యో చేరుకుంటారు.



27వ తేదీ: జపాన్ ప్రధాని, ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల, భూ, మౌలిక సదుపాయాలు, పర్యాటక, రవాణా మంత్రులతో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది. అయితే, ఈ భేటీ సమయం ఖరారు కావాల్సి ఉంది. అనంతరం ఇసుజు మోటార్స్ ప్రతినిధులు మసనోరి కటయమ, తకషి కికుచి, సుమిటొమో కార్పొరేషన్ బోర్డ్ చైర్మన్ కజౌవొమ్రి, నేషనల్ న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(నెడో) చైర్మన్ కజౌ ఫురుకవలతో సమావేశమవుతారు. అనంతరం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో భేటీ అవుతారు. తర్వాత జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్(జేబీఐసీ) గవర్నర్, సీఈవో హిరోషీ వతనబేతో సమావేశమవుతారు. తర్వాత యోకహమ నౌకాశ్రయంలో కంటైనర్ టెర్మినల్‌ను సందర్శిస్తారు.



28వ తేదీ: ఇసెకి కంపెనీ లిమిటెడ్ ఎండీ యోషియుకి, నిప్పన్ యోసన్ కై షా, మిత్సుబిషి ఉపాధ్యక్షుడు హిడెటో నకహరలతో పాటు హిటాచి ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం సుమిటొమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ చైర్మన్, మిట్సుయ్ కంపెనీ ఉపాధ్యక్షుడు దైసుకే సైగాలతో భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జెట్రో, జే ఐబీసీసీ సహకారంతో జేసీసీఐలో నిర్వహించే సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. జేఐబీసీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మునియోకురౌచీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అదే రోజున కైడన్‌రెన్ చైర్మన్ సకకిబిర , సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం తోషిబా అధ్యక్షుడు హిసావ్ తనకతో సమావేశమవుతారు. తర్వాత ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఇచ్చే విందులో పాల్గొంటారు.



29వ తేదీ: నరిటా విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.



చంద్రబాబుతో జపాన్‌కు 19 మంది బృందం

వారి ఖర్చులకు రూ. 2.40 కోట్లు విడుదల


బాబుతో పాటు మొత్తం 19 మంది అధికార బృందం జపాన్ వెళ్లేందుకు కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతించింది. దీంతో పర్యటనకు వెళ్లే వారి పేర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్ వెళ్తున్న బృందంలోని పార్లమెంట్ సభ్యులు సి.ఎం.రమేశ్, గల్లా జయదేవ్‌లకు మినహా మిగతా వారందరి వ్యయాన్ని సాధారణ పరిపాలన శాఖ భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక అధికార బృందం కాకుండా విడిగా పారిశ్రామిక, కాంట్రాక్టర్లతో కూడిన 43 మందితో మరో బృందం కూడా జపాన్  వెళ్లనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top