బాదుడే బాదుడు

బాదుడే బాదుడు - Sakshi


 ఏపీ సర్కారుకు ఏడాదికి రూ.1200 కోట్ల రాబడి

జపాన్ వెళుతూ సీఎం సంతకం.. జీవోల జారీ


 

 సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుఒకే ఒక్క సంతకంతో ఏడాదికి అదనంగా రూ.1,200 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చే నిర్ణయం తీసుకున్నారు. భూములు, స్థలాల క్రయవిక్రయాలకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, కుటుంబాల మధ్య సెటిల్‌మెంట్, గిఫ్ట్ (భూ కానుక) డీడ్ల ఫీజులను పెంచే ఫైలుపై సీఎం జపాన్ పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ బుధవారం మూడు జీవోలను జారీ చేశారు. ఈ పెంపు వెంటనే (బుధవారం నుంచే) అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేశారు.  

 

 దీంతో భూములు, స్థలాలు క్రయ విక్రయదారులపై ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా. జీవోల ప్రకారం.. స్టాంపు డ్యూటీ ప్రస్తుతం ఉన్న 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతానికి పెరిగింది. కుటుంబాల మధ్య జరిగే సెటిల్‌మెంట్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లపై ప్రస్తుతం ఉన్న ఒక శాతం స్టాంపు డ్యూటీని రెండు శాతానికి పెంచుతూ జీవో జారీ అయ్యింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో స్టాంపులు, రిజస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఇప్పటికే బాగా పెరిగింది. నూతన రాజధాని నిర్మాణం జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల క్రయ విక్రయాలు బాగా పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఆదాయం పెంపుపై దృష్టిసారించిన ప్రభుత్వం.. వస్తున్న చోటే మరింత ఆదాయం పొందాలన్నట్టుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో సెటిల్‌మెంట్, గిఫ్ట్ డీడ్లపై స్టాంపు డ్యూటీని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తగ్గించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిపై కూడా స్టాంపు డ్యూటీని పెంచింది.  

 

 పెంపు వివరాలు.. (శాతాల్లో) రంగం    

 ఇప్పటివరకు    ఇకపై  స్టాంపు డ్యూటీ    4    5

 రిజిస్ట్రేషన్ ఫీజు    0.5    1

 కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం    1    2

 ఇతరుల మధ్య ఒప్పందం    2    3

 రక్త సబంధీకులకు కానుకలు    1    2

 ఇతరుల మధ్య కానుకలు    4    5

 భాగస్వామ్య ఒప్పందాలు(కుటుంబసభ్యులు)    0.5    1

 ఇతరుల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు    1    2

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top