‘చంద్రబాబు గత చరిత్ర అంతా నీచం’

చంద్రబాబు గత చరిత్ర అంతా నీచం: భూమన - Sakshi


చంద్రబాబు చరిత్ర పాపాల మూట

నంద్యాలలో ఓటమి భయం పట్టుకుంది..

నైతిక విలువలకు కట్టుబడ్డ పార్టీ వైఎస్‌ఆర్‌ సీపీనే.
.



నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాగైనా ఉప ఎన్నికను వాయిదా వేయాలని చంద్రబాబు కుటల రాజకీయాలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. గురువారం ఆయన ఇ‍క్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ చంద్రబాబు గత చరిత్ర అంతా నీచం. గోముఖ వ్యాఘ్రమైన చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అశాంతిని రెచ్చగొడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికను ప్రశాంతంగా జరిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు గోబెల్స్‌ అన్నాలా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలా నంద్యాల ఎన్నికను వాయిదా వేయించాలని చూస్తున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీపై నిందలు వేయడం వెనుక కుట్ర ఉంది. నంద్యాలలో అశాంతిని రాజేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే హింస జరగబోతుందని చెబుతున్నారు. సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.



అధికారాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నీచానికి దిగుతున్నారు. ఆయన కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల మూట. కావాలిలో కోటయ్య అనే బలహీన వర్గాల అభ్యర్థిని చంపించింది చంద్రబాబే. ఓటర్లను ఎంతకైనా కొనేందుకు యత్నిస్తున్నారు. మీ విలువ ఎంత అని ఓటర్లను నేరుగా అడుగుతున్నారు. రూ.5వేలా..10వేలా.. 15వేలా అంటూ ఓటర్లను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పాపాల చరిత్ర మొత్తం తవ్వుతాం. దబాయించడం, బెదిరించడం, చంపించడం చంద్రబాబుకు బాగా తెలుసు. ప్రత్యర్థులు బలవంతులు అని తెలిసినప్పుడు బాబు నీచపు ఎత్తులు వేస్తారు. పోలీసులను తొత్తులుగా చేసుకునేందుకు యత్నిస్తున్నారు.



ఓటుకు కోట్లు కేసులో జైలుకు పంపిస్తారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది.  వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల ఇళ్లపైనే పోలీసులు దాడి చేస్తున్నారెందుకు?. ఒక్క టీడీపీ నేత ఇంటిపైన అయినా పోలీసులు దాడి చేయలేదెందుకు? ఆదాయపన్ను శాఖ వారు సోదా చేస్తే టీడీపీ సొమ్ము రూ.500 కోట్లుకు పైగానే దొరుకుతుంది. చంద్రబాబు గూండాలు నంద్యాలకు వస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లు  ఆక్రమించుకోవాలని చూస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఓటర్లు న్యాయంగా ఓటువేసే సౌలభ్యాన్ని కల్పిద్దాం. నైతిక విలువలకు కట్టుబడ్డ పార్టీ వైఎస్‌ఆర్‌ సీపీనే’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top