ఐదుగురు మంత్రులు అవుట్!

ఐదుగురు మంత్రులు అవుట్! - Sakshi


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కనీసంగా ఐదుగురు మంత్రులకు ఉద్వాసన చెబుతారని తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలోకి లోకేశ్ తో పాటు మరికొందరిని కూడా చేర్చుకోనున్న నేపథ్యంలో ఆయన పలువురిని మంత్రి పదవుల నుంచి తప్పించనున్నారు. కేబినెట్ లో మార్పుచేర్పులపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.



లోకేశ్ తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకట్రావు, నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేర్పించుకున్న ఎమ్మెల్యేల్లో కర్నూలుకు చెందిన భూమా అఖిల ప్రియ, చిత్తూరుకు చెందిన అమర్ నాధ్ రెడ్డిలను మంత్రివర్గంలో చేర్చుకుంటున్నట్టు సమాచారం. మైనారిటీ కోటాలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ ను కూడా కేబినెట్ లో చేర్చుకోనున్నారు. ఇటీవలి కాలంలో భూమా నాగిరెడ్డి మృతి చెందగా, ఆయన తీవ్ర ఒత్తిళ్ల కారణంగానే మరణించారని వార్తలొచ్చాయి. ఈ విషయంలో చంద్రబాబుపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అఖిలప్రియను కేబినెట్ లో చేర్చుకోవడం ద్వారా ఆ విమర్శల నుంచి కొంత బయటపడొచ్చన్న ఉద్దేశంతో ఆమెకు అవకాశమివ్వాలని భావిస్తున్నారు.




వీళ్లు కాకుండా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్, పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి కూడా అవకాశం కల్పిస్తారని వినిపిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కృష్ణాకు చెందిన కాగిత వెంకట్రావుల పేర్లు వినిపిస్తున్నా.. వారికి పెద్దగా అవకాశాలు లేవని తెలుస్తోంది.



ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న వారిలో కనీసం ఐదుగురు మంత్రులకు చంద్రబాబు ఉద్వాసన పలకనున్నారు. వారిలో ప్రముఖంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని, ఎక్సైజ్ - బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్లున్నాయి. వీరు కాకుండా అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి (చిత్తూరు), సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి (అనంతపురం) లను కూడా తప్పిస్తారని వినిపిస్తోంది. ఇంకా మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, రవాణా మంత్రి సిద్ధా రాఘవరావుల పేర్లు కూడా తొలుత ఉద్వాసన పలికే జాబితాలో ఉన్నా.. ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది.



కౌన్సిల్ చైర్మన్ గా సోమిరెడ్డి

ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి పదవీకాలం మే నెల 27వ తేదీతో ముగుస్తోంది. నిజానికి ఆయన కాంగ్రెస్ కాలంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అయినా ఆయనను కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగించారు. మే నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నియమించనున్నారు.



మంత్రుల్లో ఎవరు ఏ జాబితాలో...



సేఫ్ జాబితా : చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, కె. అచ్చన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు.



డౌట్ జాబితా : బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, సిద్ధా రాఘవరావు. (ఇందులో ఒకరు లేదా ఇద్దరిని తప్పించడం ఖాయమని తెలుస్తోంది)



ఔట్ జాబితా : కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top