కృష్ణా బోర్డుకు బాబు ఫిర్యాదు

కృష్ణా బోర్డుకు బాబు ఫిర్యాదు - Sakshi

  • శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై తక్షణం స్పందించండి

  •   నిల్వలు పడిపోతే రాయల సీమకు నీటి కష్టాలు తప్పవని వెల్లడి

  •   జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికీ ఏపీ సర్కారు లేఖ

  •  

     సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తే రాయలసీమకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందని కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. నీటి కొరత వల్ల శ్రీశైలం కుడి కాల్వ, కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట చేతికందకుండా పోతుందని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఈ నెల 21న కృష్ణా బోర్డు ఇచ్చిన ఆదేశాలనూ తెలంగాణ సర్కారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డు తక్షణం జోక్యం చేసుకొని ఏపీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా బోర్డు చైర్మన్ పండిత్ శుక్రవారం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. 

     

    సమస్య పరిష్కారానికి తన పరిధిలో అన్ని చర్యలు చేపడతానని పండిత్ హామీ ఇచ్చారు. బోర్డు నిస్పాక్షికంగా వ్యవహరిస్తుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తుందని చెప్పారు. వచ్చే వారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలను చర్చిస్తామన్నారు. కాగా, ఈ భేటీకి ముందే ఈ వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఏపీ సర్కారు లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలంలో నీటిమట్టం వేగంగా పడిపోతోందని, బోర్డు ఆదేశాలనూ పరిగణించనందున తక్షణం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కేంద్ర జల వనరుల  శాఖకు విజ్ఞప్తి చేసింది. రాయలసీమలో పూర్తిగా పంట నష్టపోయే ప్రమాదముందని, ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగవచ్చని, శాంతి భద్రతలకూ విఘాతం కలిగే ప్రమాదముందని ఏపీ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద కూడా తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో భారీగా నీరు దిగువకు విడుదలవుతున్న విషయంపై ఏపీ అధికారులు చర్చించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top