లీక్‌ బాధ్యులు ఆ ముగ్గురే: చంద్రబాబు

లీక్‌ కాదు, మాల్‌ ప్రాక్టీస్‌: చంద్రబాబు - Sakshi


అమరావతి:  అసెంబ్లీ సాక్షిగా టెన్త్‌ సైన్స్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి ‘వాటర్‌ బాయ్‌, ఇన్విజిలేటర్‌, అటెండర్‌’  బాధ్యులు అయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. ఓ వైపు నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ....లీకేజీకి నారాయణ విద్యాసంస్థలకు సంబంధమే లేనట్లు .... ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్‌ చేసిన తర్వాత లీకేజీపై చర్చ చేయకుండానే చంద్రబాబు సభలో ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని, మాల్‌ ప్రాక్టీస్‌ అయినట్లు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా 'సాక్షి'ని ఇందులోకి లాగే యత్నం చేశారు.



లీకైందన్న పేపర్‌పై లావణ్య అనే పేరు ఉందని, ఆ పేరు ఆధారంగా అధికారులు దర్యాప్తు చేపట్టారని చంద్రబాబు తెలిపారు.  ఇందుకు సంబంధించి ఇన్విజిలేటర్‌ను విధులు నుంచి తొలగించారని, అలాగే ఇద్దరు సూపర్‌ వైజర్ల మీద చర్యలు తీసుకున్నట్లు సీఎం చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఎంతటివారినైనా సహించేది లేదని,  తప్పుడు పనులు చేస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు.


నెల్లూరులో టెన్త్‌ సైన్స్‌ పేపర్‌ 10.35 గంటలకు వాట్సప్‌లో బయటకు వచ్చిందన్నారు. పేపర్‌ నారాయణ విద్యాసంస్థలోనే లీకైనా అక్కడ పరీక్ష రాసింది ఆ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు కారని ఆయన తెలిపారు. పేపర్‌ బయటకు రాగానే అధికారులు విచారణ ప్రారంభించారని చంద్రబాబు పేర్కొన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామన్నారు.



‘సాక్షి’కి బుదర అంటించే కుట్ర...



అలాగే సభలో పేపర్‌ లీకేజీపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి.. సున్నితమైన లీకేజీ అంశాన్ని 'సాక్షి'కి అంటగట్టే ప్రయత్నం చేశారు. నెల్లూరులోని ఓ పరీక్షా కేంద్రంలో ఓ వాటర్‌ బాయ్‌ ఉదయం 9.25 గంటలకు ఫోటో తీశారని చంద్రబాబు సభలో పేర్కొన్నారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష 9.30 గంటలకు మొదలవుతుంది. అంటే పరీక్ష జరగడానికి అయిదు నిమిషాల ముందే పరీక్ష పత్రాన్ని  బయటకు పంపించారు. అది కూడా నారాయణ సంస్థల సిబ్బందేనని ముఖ్యమంత్రి సభలో ధ్రువీకరించారు.



అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రకటించని మరో అంశం.. వాటర్‌ బాయ్‌ వాట్సాప్‌లో ఈ పత్రాన్ని వేర్వేరు వ్యక్తులకు పంపించి ఉంటారన్నది. దాదాపు గంట తర్వాత వేర్వేరు గ్రూపుల్లో తిరుగుతున్న విషయాన్ని పసిగట్టిన సాక్షి రిపోర్టర్‌.. దీంట్లో నిజనిజాలను తెలుసుకునేందుకు మాత్రమే ఆ పోస్టింగ్‌ను డీఈవోకి పంపించారు. ఒక వేళ సాక్షి రిపోర్టరే తప్పు చేయాలనుకుంటే డీఈవోకు ఎందుకు పంపిస్తారన్న కనీస ఆలోచన సర్కార్‌కు రాలేదు.


అసలు విషయాన్ని పక్కనబెట్టి.. ప్రభుత్వ వైఫల్యాలను పక్కకు తప్పించడానికి లీకేజీ విషయంలో సాక్షికి బురద అంటించే యత్నం చేశారు. మరోవైపు టెన్త్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంతో అధికార యంత్రాంగం నెల్లూరుకు పరుగులు తీసింది. డీఈవో ఫిర్యాదుతో  ఇంటెలిజెన్స్‌, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top