మాఫీ మంటలు

మాఫీ మంటలు - Sakshi


 శ్రీకాకుళం సిటీ:  రుణమాఫీ కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్న సర్కారు తీరుపై మహిళలు మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణం డ్వాక్రా రుణాలు మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కదం తొక్కారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి జిల్లా పర్యటనకు వస్తున్న తరుణంలో మహిళలు ఇలా నిరసన గళం విప్పి గర్జించడం అధికారులను, టీడీపీ నేతలను ఇరకాటంలోకి నెట్టింది. సీఎం పర్యటనకు రెండు రోజుల ముందే సోమవారం జిల్లాలోని అనేక మండలాల్లో డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారని సంఘాల సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పలాస, వజ్రపుకొత్తూరు, సారవకోట, లావేరు, హిరమండలం, పాలకొండ, పొందూరు, తదితర మండలాల్లో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్, ఐకేపీ, ఎంపీడీవో కార్యాలయాలను ముట్టడించి, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.పలు చోట్ల అధికారులను నిలదీశారు.

 

 ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రణస్థలం మండలం నెలివాడలో డ్వాక్రా మహిళలతో భారీ సదస్సును కూడా ఈ పర్యటనలో ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో మహిళలు రోడ్డెక్కి నిరసన మంటలు రాజేయడం అధికార పార్టీ నేతలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేసింది. ముఖ్యమంత్రి పర్యటనలోనూ మాఫీ కోసం ఎదురుచూస్తున్న మహిళలతోపాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఏం చేయాలా అని వారు తర్జనభర్జనలు పడుతున్నారు.

 

 మరోవైపు వీవోఏల సమ్మె

 ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అకౌంటెంట్స్ (విఓఎ) తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె ప్రారంభించారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెలకు రూ.5 వేల వేతనం ఇవ్వాలని, డ్వాక్రా సంఘాల అభివృద్ధి పనులు కాకుండా ఇతర విధుల విషయంలో ఒత్తిడి చేయరాదని,  తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలకు దిగారు. ఇప్పటి వరకు తమకు గౌరవ వేతనాలు చెల్లించడం లేదని, గత ప్రభుత్వం 2013లో వేతనాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నేటికీ అమలు చేయకపోవడాన్ని తప్పు పడుతూ అధికారులను నిలదీశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top