షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటం

షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటం


 కాకినాడ సిటీ : షరతులు లేని రైతు రుణమాఫీ చేసేవరకు రైతు సంఘం దశలవారీ పోరాటం నిర్వహిస్తుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద రైతుసంఘం ఆధ్వర్యంలో 72గంటల రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతుల అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులతో దొంగాట ఆడుతున్నారని, ఆయన జిమ్మిక్కులను అన్నదాతలు నమ్మరని పేర్కొన్నారు.  ఇప్పటికే బ్యాంకులు బంగారం వేలం కోసం నోటీసులు జారీ చేశాయని, వాటిని ఉపసంహరించుకోకుంటే బ్యాంకుల ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 

 రైతు కుటుంబానికి రూ.1.5లక్షల రుణమాఫీ చేస్తామని చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోకపోవడం దారుణమన్నారు.  పాత రుణాలు రద్దు కాకపోగా, బ్యాంకులు కొత్త అప్పులను ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని  ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రుణమాఫీ వర్తించని కౌలు రైతులకు రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు మూడు రోజులపాటు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షలో  రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాళ్ల అయ్యన్న, కూరాకుల చినబాబు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తాటిపాక మధు, రైతుసంఘం నాయకులు పెదిరెడ్డి సత్యనారాయణ, కోమర్తి శ్రీనివాస్, ములికి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

 డీసీసీబీ వద్ద రైతు సంఘ నాయకుల ధర్నా

 బోట్‌క్లబ్ (కాకినాడ) : రుణమాఫీపై రోజుకోమాట చెబుతున్న ప్రభుత్వ తీరుపై రైతులు కదం తొక్కారు. రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ వర్తింపజేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 174ను సవరించాలని కోరుతూ స్థానిక డీసీసీబీ కార్యాలయం వద్ద సోమవారం రైతు సంఘ నాయకులు, సహకార సంఘ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ధర్నా నిర్వహించారు. ఏపీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంకే సత్యాన్నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ షరతులతో చాలా మంది రైతులుకు రుణమాఫీ వర్తించని పరిస్థితి నెలకొందన్నారు.

 

 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణమాఫీ అమలు నిబంధన సరికాదన్నారు. ఆధార్ కార్డు, పాస్‌బుక్‌లు లేనివారికి రుణమాఫీ వర్తించని పరిస్థితి ఉందన్నారు. డిసెంబర్ 2013 నాటికి అప్పు పొందిన పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని, ఆ తర్వాత మార్చి 31 వరకూ తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదని జీఓలో పేర్కొన్నారన్నారు. దీని కారణంగా 13 జిల్లాలో సుమారు రూ.మూడు వేల కోట్లు రుణమాఫీని కోల్పోతున్నారన్నారు.  కౌలుదారులకు రుణమాఫీ వర్తింపు వల్ల సొంత భూమి ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించడం లేదన్నారు. రైతులకు తెలియకుండా రెవెన్యూ అధికారులు కౌలు రైతులకు గ్రామంలోని ఏదో ఒక సర్వే నంబర్ వేసి కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేశారన్నారు. దీని వల్ల నిజమైన రైతుకు రుణమాఫీ వర్తించని పరిస్థితి నెలకొందన్నారు.

 

 రైతులు తిరగబడుతున్నారు : జీరో వడ్డీ వస్తుందని రైతుల నుంచి రుణాలు వసూలు చేసి, వాటిని రీ షెడ్యూల్ చేశామని, దీని కారణంగా ఎంతో మంది రైతులకు రుణమాఫీ వర్తించని పరిస్థితి నెలకొందని సహకార సంఘ ఉద్యోగులు వాపోయారు. ప్రస్తుతం గ్రామాల్లోకి వెళితే రైతులు రుణమాఫీ రాకుండా చేశారని తమపై తిరగబడుతున్నారన్నారు. ప్రభుత్వం షరతులు లేకుండా రుణమాఫీ చేయకుండా తాము ఉద్యోగాలు చేయలేమని వాపోయారు. ధర్నా చేస్తున్న  రైతులకు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మద్దతు పలికారు.  కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి తోట వెంటకరామయ్య, జిల్లా అధ్యక్షుడు కె. ఆదినారాయణ, సీఐటీయూ నాయకులు దువ్వా శేషుబాబ్జి, అధిక సంఖ్యలో సహకార సంఘ అధ్యక్షులు, రైతులు

 పాల్గొన్నారు.

 

 జీఓ సవరణతో రైతులకు ఉపయోగం

 రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 174 జీఓను సవరించి సోమవారం కొత్త జీఓ 181ని విడుదల చేసిందని డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా ఒక ప్రకటనలో  తెలిపారు.  తొలుత విడుదల చేసిన జీఓ ప్రకారం డిసెంబర్ 2013 వరకూ ఉన్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, ప్రస్తుత జీఓ  ప్రకారం మార్చి 2014 వరకూ తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయని వివరించారు.  

 



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top