మాఫీయా? మాయా?

మాఫీయా? మాయా? - Sakshi


 అమలాపురం :రైతు రుణమాఫీపై గత మూడు నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులపై కోనసీమ రైతులు మండిపడ్డారు. ఎన్నికల ముందు రుణాలు మొత్తం రద్దు చేస్తానని, అధికారంలోకి వచ్చాక మాఫీకి అడ్డగోలుగా షరతులు విధిస్తున్న కపటత్వాన్ని ముక్తకంఠంతో నిరసించారు. సాగుసమ్మె ఉద్యమం తరహాలోనే కోనసీమ కేంద్రమైన అమలాపురం వేదికగా.. బేషరతుగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్‌తో రణభేరి మోగించారు.

 

 కోనసీమ కేంద్రమైన అమలాపురం బుధవారం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. రుణమాఫీ అమలుకు జారీ చేసిన జీఓ: 174ని రద్దు చేయాలని, షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రైతులు కదం తొక్కారు. కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన వందల మంది పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక గడియారస్తంభం సెంటర్లో జీఓ:174 ప్రతులను దగ్ధం చేశారు. మానవహారంగా ఏర్పడి జీఓను రద్దు చేయాలని నినదించారు. అనంతరం గడియారస్తంభం నుంచి ముమ్మిడివరం గేట్, నల్లవంతెన మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ‘రైతుల ఐక్యత వర్ధిల్లాలి, జీఓ:174ని రద్దు చేయాలి, పంటల బీమా పరిహారం రైతులకే అందించాలి, వ్యసాయాన్ని లాభసాటిగా మార్చాలి’ అంటూ రైతులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

 

 సక్రమంగా చెల్లించిన వారికి అన్యాయం..

 అంతకు ముందు గడియారస్తంభం సెంటర్లో జరిగిన సభలో బీకేఎస్ ప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు రుణమాఫీకి చంద్రబాబు సర్కార్ షరతులు విధించడాన్ని తీవ్రంగా తూర్పారబట్టారు. డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జున్నూరి బాబి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కుటుంబానికి రూ.1.50 లక్షల రుణం మాత్రమే రద్దు చేస్తానన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసి రుణమాఫీకి పరిమితి విధించినా  అంగీకరించామని, అయితే ఆర్థిక భారం తగ్గించుకునే వంకతో డిసెంబరు 31 తరువాత రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ వర్తించదని జీఓలో పేర్కొనడడం వల్ల ఉభయ గోదావరి, కృష్ణా వంటి జిల్లాలో 90 శాతం మంది రైతులు రుణమాఫీకి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు మాట్లాడుతూ ‘వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు షరతులు ఎందుకు విధించారు?’ అని నిలదీశారు. మొండి బకాయిదారులకు అవకాశం కల్పించి, సక్రమంగా రుణం చెల్లించిన రైతుకు మాఫీ వర్తింప చేయకుండా అన్యాయం చేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు.  రైతుల కడుపు నింపుతానిని గద్దెనెక్కిన చంద్రబాబు కడుపుకొట్టారని విమర్శించారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీ, కోనసీమ అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం, రైతు సంఘం నాయకులు రాయపురెడ్డి జానకిరామయ్య, నిమ్మకాయల మహీపతిరావు,

 

  డీసీసీబీ డెరైక్టర్ గోదాశి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ తక్షణం జీఓ:174ని రద్దు చేయాలని, పంటల బీమా పరిహారం రైతులకు జమ చేయాలని, దానిని ప్రభుత్వం తీసుకోవడానికి వీలు లేదని డిమాండ్ చేశారు.  మాఫీపై నమ్మకంతో రుణాలు చెల్లించని రైతులపై పడనున్న 12 శాతం వడ్డీ భారాన్ని ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విధానాలు మార్చుకోకుంటే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇన్‌చార్జి ఆర్డీఓ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు రంబాల బోస్, కార్యదర్శి వాసంశెట్టి సత్య, డివిజన్ ఆత్మా చైర్మన్ బొక్కా ఆదినారాయణ, భారతీయ ఆగ్రో ఎకనామిక్స్, రీసెర్చ్ అధ్యక్షుడు తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, రైతు సంఘం నాయకులు పత్తి దత్తుడు, జి.జమ్మి, అడ్డాల గోపాలకృష్ణ, ఎం.ఎం.శెట్టి, దామిశెట్టి చంటి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top