సీఎం హామీలివ్వకపోవడంతో నిరాశ చెందా

సీఎం హామీలివ్వకపోవడంతో నిరాశ చెందా - Sakshi


జంగారెడ్డిగూడెం రూరల్ : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాకు ఏవైనా వరాలిస్తారని తామంతా భావించామన్నారు. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉందని, కాంగ్రెస్  ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీసి ప్రజలను కష్టాల పాలు చేసిందని ఆమె విమర్శించారు. గత పాలకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 

  జిల్లాకు వ్యవసాయ, ఐఐటీ కళాశాలలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, కానీ.. వీటి నిర్మాణాలకు స్థలం కొరత ఉం దని చెప్పుకొచ్చారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మరమ్మతుల నిమిత్తం మండలంలోని 5 మసీదులకు రూ.4,967 చొప్పున చెక్కుల రూపాంలో ఆయా మసీద్ కమిటీలకు మంత్రి అందజేశారు. చింతలపూడి నియోజవర్గ టీడీపీ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు దల్లి కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

 

 కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన భూములన్నీ స్వాధీనం చేసుకుంటాం

 ఏలూరు : జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములన్నిటినీ స్వాధీనం చేసుకుని పేద రైతులకు త్వరలోనే పంపిణీ చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఏలూరులోని ఎంపీ క్యాంపు కార్యాల యంలో సోమవారం టి.నరసాపురం మండలం అల్లంచర్ల, కొత్తగూడెం గ్రామాల రైతులతో మంత్రి మాట్లాడారు. అల్లంచర్ల, కొత్తగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ పాలనలో 150 ఎకరాల అటవీ భూములను బడా నాయకులు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారన్నారు. స్థానిక రైతులు కోర్టుకు వెళ్లి ఆక్రమణ చెర నుంచి ఆ భూములను విడిపించడంతో కక్ష గట్టిన కాంగ్రెస్ నాయకులు టీడీపీకి చెందిన రైతుల 24 వ్యవసాయ బోర్లను ధ్వంసం చేశారని మంత్రి పేర్కొన్నారు.

 

 దోషులను వదిలిపెట్టేది లేదన్నారు. జిల్లాలో కొంతమంది అధికారుల్లో ఇంకా కాంగ్రెస్ వాసనలు పోలేదని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వేటు త ప్పదని హెచ్చరించాన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆక్రమణలో ఉన్న 180 ఎకరాల భూమిని అర్హులైన పేదరైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కొల్లేరు, అటవీ భూములను ఆక్రమించుకుని వాటిని లీజుకిస్తూ కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారన్నారు. ఇకపై భూ కబ్జాదారుల ఆటలను సాగనివ్వబోమన్నారు. కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, జవహర్, టి.నరసాపురం ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

 



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top