మాఫీ మెలిక.. ఇదేంటి పాలకా!

మాఫీ మెలిక.. ఇదేంటి పాలకా! - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘రైతులెవరూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టొద్దు. తెలుగింటి ఆడపడుచులూ.. డ్వాక్రా రుణాలను నయా పైసా కూడా చెల్లించొద్దు. ఒక్క సంతకంతో మీ రుణాలన్నీ మాఫీ అవుతాయి. మీరు తనఖా పెట్టిన దస్తావేజులు, కుదవ పెట్టిన బంగారం మీ ఇంటికొస్తాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం మీ రుణాలన్నీ  మాఫీ చేస్తాను’ అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిన చంద్రబాబునాయుడు తీరా సీఎం అయ్యాక పూటకో మాట చెబుతూ చివరకు రైతులను నట్టేట ముంచారు. రెండురోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్నదాతను నిలువునా దగా చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక కుటుంబంలోని వ్యక్తులు పంట రుణం, బంగారంపై వ్యవసాయ రుణాలు ఎన్ని  తీసుకున్నా  రూ.లక్షన్నర వరకు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇది కూడా ఎప్పుడు అమలవుతుందనే స్పష్టత ఇవ్వలేదు. నిధుల సమీకరణ అయిన దానినిబట్టి అమలు చేస్తామని.. నిధుల సమీకరణకు కొత్తగా మరో కమిటీ వేస్తామని  వెల్లడించారు.

 

 సర్కారు పిల్లిమొగ్గలతో వడ్డీ భారం

 రుణమాఫీ అంశంపై స్పష్టత ఇవ్వకుండా జాప్యం చేసిన కారణంగా రైతులపై వడ్డీ భారం భారీగా పడనుంది. మాఫీ చేస్తారన్న నమ్మకంతో రుణాలు చెల్లించని రైతులు డిఫాల్టర్లుగా మారారు. దీంతో రైతుల అకౌంట్లను ఓవర్‌డ్యూస్‌గా పరిగణిస్తూ బ్యాంకులు వడ్డీభారం మోపనున్నాయి. మహిళాసంఘాల రుణంతో కలిపి ఇంటికి రూ.లక్షన్నర వరకే మాఫీ అని ప్రభుత్వం చెబుతుండటంతో అంతకుమించి రుణం కలిగి ఓవర్ డ్యూస్ అయిన ఖాతాలపై భారీగా వడ్డీ భారం పడుతుందని అధికారులు తేల్చిచెబుతున్నారు. రూ.లక్షన్నరకే రుణమాఫీ అని ప్రభుత్వం ముందుగానే ప్రకటించి ఉంటే అంతకుమించి రుణాలు పొందిన రైతులు సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించేసి రాయితీ పొందేవారని, ఇప్పుడు ఓవర్‌డ్యూస్ కావడంతో ఆ రుణాలకు వడ్డీ రాయితీ వర్తించని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. సకాలంలో చెల్లించిన రైతులకు కేంద్రం ఇచ్చే 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4శాతం వడ్డీ ఓవర్ డ్యూస్ అయిన ఖాతాలకు వర్తించదని చెబుతున్నారు. దీంతో ఓవర్ డ్యూస్ అయిన వారు 12శాతం వడ్డీ చెల్లించాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.

 

 ఇప్పట్లో లెక్కతేలదు

 జిల్లావ్యాప్తంగా 8.79 లక్షల రైతుల అకౌంట్లు, మరో లక్షకు పైగా డ్వాక్రా సంఘాల అకౌంట్లకు సంబంధించి దాదాపు రూ.10వేల కోట్ల రుణా లు మాఫీ కావాల్సి ఉంది. లక్షన్నర పరిమితి, ఇంట్లో ఒకరికే రుణమాఫీ మెలికతో ఎవరికి మాఫీ అవుతుందో, ఎవరికి ఓవర్ డ్యూ అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని లీడ్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా రుణాలు చెల్లించని రైతులకు వడ్డీ భారం తప్పదని తేల్చిచెబుతున్నారు.

 

 రైతన్నకు వైఎస్సార్ సీపీ సంఘీభావం

 నిన్నటివరకు రుణమాఫీపై ఏదో ఒకటి చేస్తారని ఎదురుచూసి చివరకు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో మోసపోయిన రైతులు ఇప్పుడు తిరగబడుతున్నారు. కొత్త సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కుతున్నారు. రైతుల ధర్మాగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. దగాపడ్డ రైతులకు సంఘీభావంగా మూడురోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని, రుణమాఫీ విషయంలో సీఎం చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ప్రతిచోటా ‘నరకాసురవధ’ పేరిట ఆయన దిష్టిబొమ్మలను దహనం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం నుంచి శనివారం వరకు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 కార్యకర్తలూ.. రైతులతో కలసి కదం తొక్కండి

 జంగారెడ్డిగూడెం : రుణమాఫీపై చంద్రబాబు చేసిన దగాకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ 24, 25, 26 తేదీల్లో రాస్తారోకో, ధర్నా, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్ని పార్టీల వారు పాల్గొనాలని కోరారు. ఎన్నికలకు ముందు అమలు సాధ్యంకాని వాగ్దానాలు చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత వాటిని తుంగలోకి తొక్కారని, దీనిపై రైతులు, మహిళలు అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు.   

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top