అన్నింటికీ ‘ఆధార’మే

అన్నింటికీ ‘ఆధార’మే - Sakshi


అన్ని శాఖలూ విధిగా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయాలని మంత్రి వర్గం తీర్మానం

సాక్షి, హైదరాబాద్: ఇకపై రాష్ట్రంలో అన్నింటికీ ఆధార్‌ను లింకు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖలు విధిగా ఆధార్ అనుసంధానాన్ని అమలు చేయాల్సిందేని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది.



సచివాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలను మంత్రులు కె.అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని శాఖలు మాత్రమే ‘ఆధార్’ను అమలు చేస్తున్నాయని, ఇకపై అన్ని శాఖలూ విధిగా ‘ఆధార్’ను అనుసంధానం చేయాలని కేబినెట్ తీర్మానించినట్లు తెలిపారు. పౌర సరఫరాలు, పెన్షన్లకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధార్‌ను అమలు చేసి సత్ఫలితాలు సాధించాయని చెప్పారు.



కొత్త ఈ-మెయిల్ విధానాన్ని కూడా అమలు చేయాలని తీర్మానించినట్టు తెలిపారు. ప్రభుత్వమే ఈ-మెయిల్‌ను క్రియేట్ చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి ఉద్యోగుల వరకు కామన్‌పూల్‌లో తీసుకుని ఉపయోగించుకునేలా విధానాన్ని రూపొందిస్తామని వివరించారు. విజయదశమి (అక్టోబర్ 22) పర్వదినాన రాజధానికి శంకుస్థాపన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని, అదే రోజుల పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన చేత ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.



సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు జీవో 22, 63లలో కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును ఆగస్టు 15లోగా పూర్తిచేసి, గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజికి తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు మిగులు నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తరలిస్తామన్నారు. పోలవరం కుడికాలువ భూసేకరణకు రూ.701 కోట్లు కేటాయించామని, కాలువ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించామని చెప్పారు.



విప్లవయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రి మండలికి లేఖ రాయాలని తీర్మానించినట్లు తెలిపారు. విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సమకూర్చుతుందని చెప్పారు. అల్లూరి జయంతిని ఏటా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పారదర్శక పాలన అందించేందుకు అన్ని శాఖల అధికారులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి విజిలెన్స్, సీఐడీ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్‌తో కమిటీని వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అగ్రి గోల్డ్ ఆస్తులను విక్రయించడం ద్వారా బాధితులకు పరిహారం చెల్లించడానికి ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది.

 

ఘనంగా గోదావరి పుష్కరాలు..

గోదావరి పుష్కరాలను ఈనెల 14 నుంచి 25 వరకు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. పుష్కరాల్లో రాష్ట్ర ప్రజలందరూ పాలు పంచుకునేలా ఈనెల 7 నుంచి 13 వరకూ గ్రామగ్రామాన ప్రచారం చేయాలని నిశ్చయించింది. ఈ ప్రచారంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనూ వివరించనున్నారు. ఇందుకోసం మంత్రుల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను వేశారు. కమిటీల్లో ఆయా శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.



గోదావరి పుష్కరాల ప్రాముఖ్యతపై వ్యాసరచన, చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించి.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అవార్డులివ్వనున్నారు. పుష్కరాలకు కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, జాతీయ మీడియా ప్రతినిధుల్ని ఆహ్వానించడానికి మంత్రుల నేతృత్వంలో ఓ కమిటీని, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రంలో మీడియా ప్రతినిధులను ఆహ్వానించడానికి మరో కమిటీని నియమించనున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

* మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం


సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు, తెలంగాణ ప్రభుత్వం వ్యవహార శైలి, ఓటుకు నోట్లు తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి  హైదరాబాద్‌లో బసచేసిన నేపథ్యంలో ఆయనను నలుగురైదుగురు మంత్రులు కలసి సెక్షన్-8పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.



ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ అనుసరిస్తున్న వైఖరిని వివరించాలని తీర్మానించారు. తెలంగాణకు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ మే 28న ఫిర్యాదు చేస్తే అంతకు ఐదురోజులు ముందుగా అంటే 23నే టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు అధికారుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు అనుమతివ్వాలంటూ నలుగురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంతకాలతో కేంద్రానికి టీప్రభుత్వం లేఖ రాసిన విషయాన్నీ ప్రస్తావించాలని నిర్ణయించారు.

 

ఇకపై కంపెనీల చేతిలో మద్యం ధరలు

* కర్ణాటక తరహా విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: మద్యం కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే మద్యం ధరలను ఇక నుంచి ప్రభుత్వం నిర్ణయించకూడదని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. మద్యం ధరల విషయంలో కర్ణాటక తరహా విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను బారిన పడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ తరుఫున మద్యం లావాదేవీలను కొనసాగిస్తుందని పేర్కొంటున్నారు.

 

గృహ నిర్మాణ అక్రమాలపై సభాసంఘం


సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లనుంచి ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన 41 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మాణం జరగలేదని, లబ్ధిదారుల పేర్ల మీద రూ.5,500 కోట్ల మేర దోపిడీ జరిగిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. గృహ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి శనివారం నివేదిక సమర్పించినట్లు చెప్పారు. గృహనిర్మాణంలో జరిగిన అక్రమాలపై సభాసంఘం నియమించేందుకు మంత్రివర్గ భేటీలో తీర్మానించామని, ఒకట్రెండు రోజుల్లో సభాసంఘం చైర్మన్ పేరును ప్రకటిస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top