చంద్రబాబు దొంగాట


  •      రుణమాఫీ ప్రకటనతో సరి

  •      విముక్తి కల్పించినట్టు బాబు హడావుడి

  •      విడుదల కాని విధివిధానాలు

  •      అదెలా సాధ్యమని బ్యాంకర్ల విస్మయం

  • రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటిస్తే చాలా?... బ్యాంకుల్లో రూపాయి జమ చేయలేదు. రుణమాఫీపై విధివిధానాలు జారీ కాలేదు. రైతులు, మహిళలకు రుణ విముక్తి కల్పించేశామని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. టీడీపీ శ్రేణులైతే భారీఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ‘అదెలా సాధ్యమో అర్థం కావడం లేదు.. ఇలాంటి ప్రకటనలతో రైతుల నుంచి సొమ్ము వసూలు కాదంటున్నారు’ బ్యాంకర్లు. ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు మంచిది కాదని హితవు పలుకుతున్నారు.  

     

    విశాఖ రూరల్: రుణ మాఫీపై ప్రభుత్వం తీరు రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ మాఫీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదని నిన్నమొన్నటి వరకు ప్రభుత్వం ప్రకటించడంతో.. రుణాల రీషెడ్యూల్‌పై రిజర్వ్‌బ్యాంకు సానుకూల నిర్ణయం తీసుకుంటుదన్న వార్తలు వినిపించాయి. ఒకవేళ రుణాలు రీషెడ్యూల్ చేసినా రైతులపై 12 శాతం వడ్డీ భారం పడుతుంది. అయినప్పటికీ కొత్త రుణాలు వస్తాయనుకున్న సమయంలో రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

     

    రైతు కుటుంబంలో రూ.లక్షన్నర, డ్వాక్రా సంఘానికి రూ.లక్షలోపు రుణం మాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ పైసా కూడా బ్యాంకుల్లో నిధులు జమ చేయలేదు. మంత్రులు, టీడీపీ శ్రేణులు మాత్రం రుణాలు మాఫీ చేసేశామంటూ మిఠాయిలు పంచుకుంటూ పెద్ద హడావుడే సృష్టించారు. వాస్తవానికి నిజంగా రుణాల మాఫీ జరిగితే రుణాల రీషెడ్యూల్ అవసరమే ఉండదు.

     

    రుణ మాఫీ కోసం ఎర్రచందనం అమ్మకాలు, గనులు, ఇతరత్రా మార్గాల నుంచి నిధులు సమీకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి ఎంత సమయం పడుతుందన్న విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. రుణాలు మాఫీ చేయకుండానే ఏదో జరిగిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించడం వల్ల రుణాల రీషెడ్యూల్‌కు రిజర్వ్‌బ్యాంక్ అంగీకరించే అవకాశముండదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. వనరులు అమ్ముకొని సొమ్ము చేసుకునేలోపు ఖరీఫ్ సీజన్ ముగిసిపోతుంది. ఈలోగా కొత్త రుణాలు అందే అవకాశముండదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుంది.

     

    బ్యాంకులకు సమాచారమే లేదు : రుణ మాఫీకి సంబంధించి బ్యాంకులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. కనీసం జిల్లాలో రూ.లక్షన్నర లోపు రుణాలు పొందిన రైతుల జాబితా కూడా అధికారుల వద్ద లేదు. రాష్ర్ట స్థాయిలో బ్యాంకర్ల నుంచి తీసుకున్న సమాచారాన్ని కూడా జిల్లా అధికరులకు అందించడం లేదు. రుణ మాఫీ ప్రకటనలో స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లు నోరు మెదపలేకపోతున్నారు.



    కుటుంబంలో ఒకరికా లేదా కుటుంబం మొత్తం మీద రూ.లక్షన్నర వరకు మాఫీ జరుగుతుందన్న విషయంపై గందరగోళం నెలకొంది. జిల్లాలో గత ఏడాది మొత్తంగా రూ.1040 కోట్ల రుణాలు అందించారు. ఇందులో రూ.లక్షన్నరలోపు ఎంతమంది రుణాలు పొందారో లీడ్ బ్యాంక్ అధికారుల వద్ద కూడా సమాచారం లేదు. రుణ మాఫీపైనే కాకుండా కనీసం రుణాల రీషెడ్యూల్‌పై కూడా రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు.

     

    డ్వాక్రాలోను గందరగోళమే

     

    డ్వాక్రా రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. ఇందులో జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు రూ.593 కోట్లు బ్యాంకులకు బకాయి పడ్డాయి. ఇందులో రూ.లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 మాత్రమే ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. రుణ మాఫీ ప్రకటన చేసినప్పటికీ బ్యాంకులు కొత్త రుణాలు అందించడం లేదు. ప్రభుత్వం రుణాలను బ్యాంకుల్లో జమ చేసిన తరువాతే కొత్త రుణాలపై నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే మహిళా సంఘాలకు ఇప్పట్లో రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top