టీడీపీ నేతల గూండాగిరీపై హోరెత్తిన అసెంబ్లీ

ఐపీఎస్‌ అధికారి గన్‌మన్‌పై దాడి చేస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(ఫైల్‌) - Sakshi


సర్కారు తీరును సభలో ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ

‘సెటిల్‌మెంట్ల సీఎం చంద్రబాబు డౌన్‌ డౌన్‌..’ అంటూ నినాదాలు

ఉద్యోగులకు, పోలీసులకు, మహిళలకు

రక్షణ కల్పించాలని విపక్షం డిమాండ్‌




సాక్షి, అమరావతి: అధికారులు, ఉద్యోగులు, మహిళలపై  తెలుగుదేశం నేతల గూండాగిరీపై సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. అందరూ చూస్తుండగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన, గన్‌మెన్‌పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ శాసనసభ ప్రాంగణంలో మౌన దీక్ష చేపట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, గన్‌మెన్‌పై దాడి చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సా ర్‌సీపీ డిమాండ్‌ చేసింది.



 ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం... రౌడీ రాజ్యం, గూండా రాజ్యం... దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం’ నినాదాలతో విపక్ష సభ్యులు సభను హోరెత్తించారు. ఐపీఎస్‌ అధికారిపై దాడి, విపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టుపై మాట్లాడేందుకు తమ నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ 2 గంటలకు పైగా స్పీకరు పోడియంలో నిలబడి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు, ఉద్యోగులపై దాదాగిరీ చేసిన ప్రజాప్రతినిధి సభలో మాట్లాడగా... తప్పు చేసినవారిని శిక్షించాలని కోరిన ప్రధాన విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై సభ అట్టుడికింది. శాసనసభ జరుగుతుండ గానే ఎమ్మెల్యేను పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అరెస్టు చేయడం, హైడ్రామా కొనసాగించడం తప్పంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.



నోరు నొక్కిన అధికారపక్షం

జీరో అవర్‌ అనంతరం వాయిదా పడిన సభ మధ్యాహ్నం 2.03 గంటలకు ప్రారంభం కాగానే పద్దులపై చర్చ కొనసాగించాలని స్పీకరు సూచించారు. వెంటనే ఎమ్మెల్యే బొండా ఉమ లేచి ప్రసంగం ఆరంభిస్తుం డగానే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మైక్‌ ఇవ్వాలని కోరారు. స్పీకరు అనుమతితో విపక్ష నేత మైక్‌ తీసుకుని ‘మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు...’ అనగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మ ణ్యంపై  టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల దౌర్జన్యం,  గన్‌మెన్‌పై దాడి  గురించి నిలదీస్తారని, గతం లో టీడీపీ నేతలు చేసిన దాడులను ప్రస్తావి స్తారనే భయంతోనే అధికార పక్షం జగన్‌ మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.



విపక్ష సభ్యుణ్ణి అసెంబ్లీ ప్రాంగణంలోనే పోలీసులు అరెస్టు చేస్తే నిరసన తెలిపే హక్కు లేదా? ఇందుకు కూడా 5 నిమిషాలు మైక్‌ ఇవ్వరా? అని వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించినా స్పందించలేదు. దీంతో ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌... చెవిరెడ్డిని వెంటనే విడుదల చేయాలి...’ అంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులంతా పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ నినాదాలు, గందరగోళం, ఏమి మాట్లాడుతున్నారో వినిపించని పరిస్థితుల్లోనే అధికార పక్ష ఎమ్మెల్యే బొండా ఉమా ప్రసంగాన్ని కొనసాగించారు.



‘ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నీకు కొమ్ములొచ్చాయా? ఏం బతుకు మీది...’ అంటూ అవమానించిన బొండా సభలో దర్జాగా మాట్లాడగా... అధికార పక్ష నేతల దౌర్జన్యాలను ప్రశ్నించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మాత్రం పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో పెట్టడం అధికారపక్ష నియంతృత్వాన్ని బట్టబయలు చేసింది.



 పరామర్శించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన అయిదుగురు ఎమ్మెల్యేలను కనీసం చెవిరెడ్డిని కలిసేందుకు కూడా పోలీసు అధికారి అనుమతించకపోవడానికి సర్కారు పెద్దల ఒత్తిడే కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ అన్యాయంపై విపక్ష సభ్యులు మరింత గట్టినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోడియంలో నినాదాలు చేయడంతో మధ్యాహ్నం 2.11 గంటలకు స్పీకరు సభను పది నిమిషాలు వాయిదా వేసినట్లు ప్రకటించారు.



సెటిల్‌మెంట్‌ సీఎం చంద్రబాబు...

మధ్యాహ్నం 3.26 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ పద్దులపై చర్చ అని స్పీకరు అనగానే... ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వాలని కోరారు. స్పీకరు మైక్‌ ఇవ్వకపోవ డంతో పోడియంలోకి వెళ్లి  నిరసన వ్యక్తం చేశారు. ‘బొండా ఉమను వెంటనే అరెస్టు చేయాలి’, ‘ పోలీసులకు రక్షణ కల్పించాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘తెలుగుదేశం గూండాల నుంచి ఐఏఎస్‌లకు, ఐపీఎస్‌లకు రక్షణ కల్పించాలి, కానిస్టేబుళ్లకు రక్షణ కల్పించాలి, ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. ఎమ్మార్వోలకు రక్షణ కల్పించాలి.. ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం.. గూండా రాజ్యం, రౌడీ రాజ్యం’ అంటూ సభను హోరెత్తించారు. అధికార పక్ష నేతలవల్ల అవమానాలు ఎదుర్కొన్న, దెబ్బతిన్న అధికారుల పక్షాన విపక్షం అండగా నిలవగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సెటిల్‌మెంట్‌ రాజీల తో పక్షపాత వైఖరి ప్రదర్శించడంపై వైఎస్సా ర్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.



అరెస్టు చేసిన పోలీసులు వదిలిపెట్టడంతో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాయం త్రం 4.40 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత సాయంత్రం 5.05 గంటలకు సీఎం చంద్రబాబు సభలోకి వచ్చారు. అధికారులపై దాడులు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా రాజీకుదిర్చిన సీఎం తీరుపై ఆగ్రహంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. ‘సెటిల్‌మెంట్ల సీఎం చంద్రబాబు డౌన్‌ డౌన్‌..’ అంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు నినాదాలు, నిరసనల మధ్య గందరగోళ పరిస్థితుల్లోనే కేవలం గంటంపావు సమయంలోనే రికార్డుస్థాయిలో 37 పద్దులు, 12 బిల్లులను ఏకపక్షంగా, ఎలాంటి చర్చ లేకుండా ‘పాస్‌’ చేసేశారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు స్పీకరు సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top