కిరికిరి మనిషి అంటాడా?

కిరికిరి మనిషి అంటాడా? - Sakshi


(సాక్షి వెబ్ ప్రత్యేకం)


అదేంటి గురువా అలా అయిపోయావు. పొరుగు రాష్ట్రం ఆయన ఏదో మాట తూలితే ఇలా డల్ గా అయిపోవడం ఏం బాలేదు.  నిన్నెవరైనా ఒక్క మాటంటే వాళ్లపై వంద మాటలతో దాడి చేయడానికి మేమంతా లేమా. అయినా పాలిటిక్స్ లో క్రిటిసైజ్ చేసుకోవడం కామన్ అని నీకు చెప్పేంత వాడిని కాదనుకో.



అదికాదురా నాతో కలిసి పనిచేసిన సహచరుడే నన్ను కిరికిరి మనిషి అని లక్షలమంది ముందు నోరు పారేసుకోవడం ఆవేదన కలిగింది శిష్యా. సాటి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్నానన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు తిట్టడం తట్టుకోలేకపోయా. పదేళ్లు పవర్ లేనప్పుడు కూడా ఇంత బాధ కలగలేదంటే నమ్ము.



ఏదో విమర్శించాలని అలా అని ఉంటాలే. దానికి ఇంత ఇదైపోతే ఎలా గురువా. రాజకీయాలన్నాక ఇలాంటివి మామూలే. ఆ మాటకొస్తే పవర్ పాలిటిక్స్ లో తిట్టు తినకుండా నెగ్గుకొచ్చిన నాయకుడు నేటి జమానాలోఒక్కడైనా ఉన్నాడా చెప్పు.  ఎన్ని తిట్లు తిని మనమీ స్థాయికి వచ్చాం. పిల్లనిచ్చిన సొంత మామ పదో గ్రహం అని పదేపదే తిట్టినా పట్టించుకోనోడివి కొత్త రాష్ట్రం నేత నిన్ను కిరికిరి మనిషివి అన్నాడని ఆవేదన చెందడం అబ్బెబ్బే అస్సలు కరెక్టు కాదు.



అదలా ఉంచరా అంతా కలిసునప్పుడు అభివృద్ధి కోసరం ఎంత కష్టపడ్డాను. పేరుకే సీఎంనే అయినా సీఈవోగా పనిచేసి భాగ్యనగరాన్ని 'హై'టెక్కులో నిలిపింది నేను కాదా.  అప్పటి అగ్రరాజ్యాధినేతను హైదరాబాద్ కు తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూసేలా చేసింది నేనన్న సంగతి మర్చిపోయారు. ప్రతిదానికి అడ్డుపడుతున్నాంటూ ఇప్పుడు నాపై గయ్యిమనడం గులాబీ నేతకు తగునా?



బాధపడకు గురువా పడ్డవాడేవడూ చెడ్డవాడు కాదు. అసలు నీ ప్రమేయమే లేకపోతే ఉద్యమ నేత తన రాష్ట్రానికి సీఎం అయ్యేవాడేనా. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీయమని ముందు చెప్పిందే ననేనంటూ నువ్వెన్నిసార్లు మీడియా ముఖంగా చెప్పినా ఆయనగారి చెవికెక్కలేదమో. అందుకే నిన్ను అంతలా ఆడి పోసుకుంటున్నాడు.



మనం తయారు చేసుకున్న నాయక తమ్ముళ్లను నిమ్మళంగా లాక్కుపోయినా గమ్మునున్నా కానీ కారు పార్టీ నేతను ఒక్క కానిమాటైనా అన్నానా శిష్యా. ఒకరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకుంటామన్నాం కానీ పల్లెత్తు మాట తూలలేదు.  అప్పుడెప్పుడో పార్టీని కాపాడేందుకు 'వెస్రాయ్ వ్యూహం' పన్నానేగాని ఆయనలా గంపగుత్తగా 'ఆకర్షణ' పథకం పెట్టలేదె. ఇదంతా కాదు నేనెంటే భయపడే పదేపదే నన్ను తిడుతున్నాడు.


-పి. నాగశ్రీనివాసరావు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top