డ్వాక్రా వడ్డీ రాయితీకి ఎగనామమే!

ఎమ్మెల్యే వనమాడి ఇంటిని ముట్టడించిన డ్వాక్రా మహిళలతో చర్చిస్తున్న ఆయన సోదరుడు సత్యనారాయణ(ఫైల్) - Sakshi


మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిలిపేసిన ప్రభుత్వం

గతేడాది ఎనిమిది నెలలకు రూ. 377 కోట్లు విడుదల చేయాలి

పాత బకాయిలతో కలిపి రూ. 444 కోట్లు చెల్లించాలి

ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు

గతంలో పావలా వడ్డీని అమలు చేసిన వైఎస్

కిరణ్ హయాంలో జీరో వడ్డీగా మార్పు

టీడీపీ ప్రభుత్వం చెల్లింపుల నిలిపివేత




సాక్షి, హైదరాబాద్: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అదంతా వారి ఓట్ల కోసం చేసే జిమ్మిక్కేనని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని ఎలాగూ తుంగలో తొక్కారు. ఇప్పుడు వారికి రావాల్సిన జీరో వడ్డీ రాయితీని కూడా ఎగనామం పెడుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి కట్టిన డ్వాక్రా సంఘాలకు గత ప్రభుత్వాలు వడ్డీ రాయితీని కచ్చితంగా అమలు చేశాయి. నేడు ఈ పథకానికి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.



ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు డ్వాక్రా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 377 కోట్లు వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉంది. అయితే అందులో ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళల రుణాలపై పావలా వడ్డీని అమలు చేశారు. ఆ తర్వాత 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని జీరో వడ్డీగా మార్చారు.



2014 జనవరి వరకు సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ రాయితీని ప్రభుత్వం పూర్తి మొత్తంలో విడుదల చేసింది. అయితే ఆ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి పూర్తి వడ్డీ రాయితీని చెల్లించలేదు. దాంతో ఆ రెండు నెలలకు దాదాపు రూ. 67 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. ఏప్రిల్ నెల నుంచి నెలవారీ చెల్లించాల్సిన వడ్డీ రాయితీ  పూర్తిగా నిలిచి పోయింది.



డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం 6,41,774 లోన్లకు గాను 4,58,611 లోన్లకు సంబంధించిన వారు సకాలంలో బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తున్నారు. వారికి రూ. 377.13 కోట్లు వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీనికి పాత బకాయి రూ. 67 కోట్లతో కలుపుకొని ఇప్పటి వరకు దాదాపు రూ. 444 కోట్లు డ్వాక్రా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న మహిళలు వాయిదాలు క్రమం తప్పకుండా కడితే వారి వడ్డీని నెలవారీగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ వారు కొన్ని నెలలు కట్టలేకపోయి తర్వాత అసలుతో పాటు వడ్డీ కలిపి కట్టినా అలాంటి వారికి కూడా ఆ నెల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తుంది.



వాయిదాలు కట్టినా అప్పుల ఊబిలోనే..

ప్రభుత్వం సజావుగా వడ్డీ రాయితీని నెలవారీ చెల్లించి ఉంటే.. వాయిదాలు సకాలంలో కట్టిన సంఘాలన్నీ నిర్ణీత గడువులోనే రుణ విముక్తి అయ్యేవి. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్య కాలంలో దాదాపు లక్షా 60 వేల బ్యాంకు రుణాలకు సంబంధించి తిరిగి చెల్లించడం జరిగింది. ఆ సంఘాలు కొత్తగా రుణాలు తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సకాలం వడ్డీ రాయితీ చెల్లించని కారణంగా ఈ సంఘాలన్నీ వాయిదాలు చెల్లించినా ఇంకా అప్పుల ఊబిలో కొనసాగుతున్నాయి.



ప్రభుత్వం ఇప్పటికిప్పుడు వడ్డీ రాయితీకి చెల్లించాల్సిన రూ. 444 కోట్లు విడుదల చేసినా.. ఈ మధ్య కాలానికి వడ్డీని ఆయా సంఘాలు చెల్లిస్తేనే అవి అప్పుల నుంచి బయటపడతాయి. కొత్తగా రుణం తీసుకోవడానికి అర్హత పొందుతాయి. ప్రభుత్వం వడ్డీ రాయితీ రూపేణా చెల్లించాల్సిన రూ. 444 కోట్లపై డ్వాక్రా మహిళలు దాదాపు రూ. 35 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయగానే సంఘాల ఖాతాకు జమ చేయాల్సిన వడ్డీ జమ చేస్తామని జిల్లా అధికారులు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో లక్షా 60 వేల సంఘాల్లో దాదాపు 20 వేల సంఘాలు వడ్డీ కూడా వారే ముందుగా చెల్లించి కొత్తగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నట్టు చెబుతున్నారు.



బాబు హామీ.. ఆనక కప్పదాటు

2014 మార్చి 30: టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ‘ఆర్థిక చిక్కుల్లో ఉన్న డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింప చేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం’ అని హామీ ఇచ్చారు.



2014 జూన్ 8:  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రైతు, చేనేత రుణాలతో పాటు డ్వాక్రా రుణాలు మాఫీకి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు



2014 జూలై 21: రాష్ట్ర రెండో మంత్రివర్గ సమావేశ అనంతరం డ్వాక్రా గ్రూపు రుణాలు మాఫీకి బదులు ప్రతి గ్రూపునకు లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం ఆయా సంఘాల కార్పస్ ఫండ్‌కు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు విలేకరుల సమావేశంలో సీఎం  చంద్రబాబు ప్రకటన చేశారు. (ఇప్పుడు మంత్రులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రతి డ్వాక్రా గ్రూపునకు లక్ష రూపాయల సాయానికి బదులు, సంఘంలో ప్రతి సభ్యునికి పది వేలు సాయంగా అందజేయాలని ప్రభుత్వ ఉద్దేశం. సంఘంలో పది మంది సభ్యులుంటే లక్ష, 8 మందే సభ్యులుంటే 80 వేలు వస్తుంది.)



2015 జనవరి 31: మాఫీ ఎటూ లేదు.. పది వేల ప్రభుత్వ సాయం ప్రకటనకు నియమ నిబంధనలు కూడా తయారు చేసే ఆలోచనప్రభుత్వం మానేసింది. దీనికి తోడు గత పదేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ రాయితీ ఇవ్వడం నిలిపివేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top