కార్పొరేట్ కౌగిలిలో చంద్రబాబు బందీ


  •      సీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైంది

  •      మూడు నెలల్లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించారు

  •      రుణమాఫీపై స్పష్టత లేదు

  •      సీమ సమస్యలపై జాతా నిర్వహిస్తాం

  • పీలేరు: సామాన్య ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు కార్పొరేట్ కౌగిలిలో బందీ అయ్యారని సీపీఎం జాతీయ కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్ అన్నారు. ఆదివారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గతంలో సీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని, చంద్రబాబు ఆ విషయమై ఇప్పటివరకు కేంద్రంతో చర్చించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.



    రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టా రు. మూడు నెలలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చంద్రబాబు నవ్యాంధ్ర సాధనకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రజా విశ్వా సం కోల్పోయే స్థాయికి చేరుకుందని అన్నారు. గత ప్రభుత్వం 27 వేల మంది డ్వాక్రా యానిమేటర్లకు నెలకు రూ.2 వేలు జీతం ఇస్తానని ప్రకటించిందని, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారని చెప్పారు.



    బాబువస్తాడు..జాబు వస్తుందని అందరూ ఓట్లువేసి అధికారాన్ని కట్టబెట్టారని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 14 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించి బాబు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. బాబు దొరబాబులను కలుస్తున్నారు తప్ప పేదల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు డమ్మీలు కావడం వల్లే ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపిం చారు. బాబు రాయలసీమకు ద్రోహం చేస్తే చరిత్ర క్షమించదన్నారు.



    సీమ సమస్యలపై త్వరలోనే ప్రజల తో జాతా నిర్వహిస్తామన్నారు. తాము మొదటి నుంచీ రాష్ర్ట విభజనకు వ్యతిరేకమేనని, అనివార్య కారణాలతో విభజన జరిగిందని అన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితమైతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు కందారపు మురళి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంగరాజు, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top