వ్యవసాయంలో ‘ఉపాధి’ లేదు.. సేవా రంగమే భేష్‌

వ్యవసాయంలో ‘ఉపాధి’ లేదు.. సేవా రంగమే భేష్‌ - Sakshi

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

 

సాక్షి, అమరావతి: గతంలో వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం కంటే సేవారంగమే మిన్న అని చెప్పారు. వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మారాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సేవా రంగం వాటా 70 నుంచి 80 శాతం వరకు ఉంటే, వ్యవసాయ రంగం వాటా కేవలం 4 శాతానికే పరిమితమవుతోందని, సేవల రంగం వృద్ధి చెందితే మౌలిక వసతులు కూడా పెరుగుతాయని అన్నారు.



బుధవారం విజయవాడలో ప్రారంభమైన రెండురోజుల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. గతంలో హైదరాబాద్‌లో సేవారంగాన్ని ప్రోత్సహించడం వల్లే మౌలికవసతులు పెరిగాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే టూరిజం, ఆతిథ్యం వంటి రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక వ్యవసాయం అంటే ఉద్యాన పంటలేనని, రైతులను వ్యవసాయం నుంచి ఉద్యానవన పంటల వైపు మారేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన అంశాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

 

రాష్ట్ర వృద్ధి రేటు 11.72 శాతం

‘దేశంలో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతున్నా రాష్ట్రం మాత్రం రెండంకెల వృద్ధిరేటుతో దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశ వృద్ధి రేటు 5.6 శాతం కాగా రాష్ట్రంలో 11.72 శాతం నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కచ్చితంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తాం. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణ లు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సచివాలయంలో కొన్ని విభాగాలు ఎందుకున్నా యో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇలాంటి అప్రాధాన్య శాఖలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కోల్డ్‌ చైన్, ఆర్థికాభివృద్ధి, డ్వాక్రా సంఘాల అభివృద్ధి వంటి కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తాం. 

 

బయోమెట్రిక్‌ తప్పనిసరి

రేపటి నుంచి (గురువారం) నాతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేస్తాం. అభివృద్ధి కి పుష్కలమైన అవకాశాలున్నా.. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకంజలో ఉండటానికి, తలసరి ఆదాయం తక్కువగా ఉండటానికి నేతలు, అధికార యంత్రాం గం వైఫల్యమే కారణం. ప్రతి మూడు నెలలకు నాతోపాటు అందరి పనితీరును (ప్రోగ్రెస్‌ రిపోర్టును) సమీక్షించి పాసో, ఫెయిలో తేలుస్తాం’ అని బాబు అన్నారు.   

 

తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఏపీ 

తలసరి ఆదాయంలో రాష్ట్రం తొమ్మిదవ స్థానంలో ఉంది. కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. 201718 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,55,000గా పేర్కొంది. అయితే తలసరి ఆదాయంలో రాష్ట్రం 201516 ఆర్థిక సంవత్సరంలో 15.44 శాతం వృద్ధి సాధించగా, 201617లో వృద్ధి 12.14 శాతానికే పరిమితమైంది. తలసరి ఆదాయంలో ఏపీ కన్నా తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాలు ముందున్నాయి. హర్యాణా, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలు ఏపీకన్నా ముందున్నాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top