‘బాబు’ మారలేదు..ద్రోహం మానలేదు..

‘బాబు’ మారలేదు..ద్రోహం మానలేదు..


కాకినాడ సిటీ :ఎన్నికలకు ముందు తాను మారిన మనిషినని పదేపదే చెప్పిన చంద్రబాబు ఏ మాత్రం మారలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి దడాల సుబ్బారావు విమర్శించారు. జపాన్, సింగపూర్ అంటూ పెట్టుబడిదారుల జపం చేస్తూ కార్మికోద్యమాలను, పోరాటాలను అణచివేసేలా వ్యవహరిస్తూ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని, విధానాలను నిరసిస్తూ వివిధ పథకాల్లో పనిచేస్తున్న మహిళలు గురువారం కాకినాడలో కదం తొ క్కారు. జిల్లా నలుమూలల నుంచీ అంగన్‌వాడీ కార్యకర్తలు, వెలుగు యానిమేటర్లు, ఆశా వర్కర్లు, వైద్య, ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు, మధ్యాహ్న భో జన పథకం కార్మికులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు వేలాదిగా తరలి వచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆక్రోశించారు.

 

 పెంచిన పనిగంటలకు తగ్గట్టు  వేతనాలు పెంచాలని, సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని, రిటైర్‌మెంట్ ప్రయోజనాలు కల్పించాలని అం గన్‌వాడీలు, 18 నెలల బకాయిలు తక్షణం చెల్లించాలని, సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని వెలుగు యానిమేటర్లు, వేతనాలు పెంచి, బకాయి బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, కనీస వేతనాలు అమలు చే యాలని, బకాయి పారితోషికాలు చెల్లించాలని ఆశా వర్కర్లు, ఉద్యోగాలను క్రమబద్ధం చేయాలని, అర్బన్ హెల్త్ సెంటర్లు మూసివేయరాదని వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు.

 

 పెట్టుబడిదారుల ఊడిగం చేస్తున్న మోదీ, బాబుల జోడీ

 ఆందోళనకు సంఘీబావం తెలిపిన సీపీఎం జిల్లా కార్యదర్శి దడాల ఆ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వివిధ పథకాల కార్మికులు అతి తక్కువ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల రుణం తీర్చుకునేందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుల జోడీ కృషి చేస్తోందని విమర్శించారు. ముట్టడి అనంతరం నాయకులు ఏజేసీ మార్కండేయులుకు వినతిపత్రం అందజేశారు.  వివిధ సంఘాల నాయకులు దువ్వా శేషబాబ్జి, జి.బేబిరాణి, టి.సావిత్రి, సత్తిరాజు, పలివెల  వీరబాబు, పలివెల శ్రీనివాస్, ఎం.వీరలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top