హైలెవల్ కలేనా?


సాక్షి, నెల్లూరు: రెండు నియోజకవర్గాల ప్రజలకు వరప్రదాయిని అయిన నీటిపారుదల ప్రాజెక్టుకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన, అప్పట్లో మొదలైన అన్ని పనులను వెంటనే రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను ఆదేశించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 3 లక్షల మందికి తాగునీరు, 95 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించతలపెట్టిన సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులను చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టింది. అన్ని పనులనూ రివ్యూచేసిన  తర్వాతే హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు పనులు చేయాలా? వద్దా? అనే  విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

 

 ఆర్థికలోటు నేపథ్యంలో గత ప్రభుత్వంలో వందల కోట్లతో మంజూరు చేసిన పనులను సర్కార్ రద్దుచేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ప్రస్తుత సర్కార్ ఉన్న పరిస్థితిలో రూ.1585 కోట్ల భారీ మొత్తంతో పనులు చేపట్టడం సాధ్యం కాకపోవచ్చని ఇంజనీరింగ్ అధికారుల అభిప్రాయం. ఇదే జరిగితే జిల్లాలో మెట్టప్రాంతాల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారనుంది. రెండు నియోజక వర్గాల్లో సాగునీటి ఇబ్బందులతో పాటు తాగునీటి కష్టాలు తప్పవు.

 

 హైలెవల్ కెనాల్ నేపథ్యం

 సోమశిల నుంచి ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు సాగు,తాగు నీరు ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేకపాటి సోదరులతో పాటు ఆనం సోదరులు కాలువ విషయాన్ని ఆయనకు నివేదించారు. హైలెవల్ కెనాల్ ప్రయోజనాలను గుర్తించిన వైఎస్సార్ వెంటనే ప్రాజెక్ట్‌కు సంబంధించి నిపుణులతో కమిటీ నియమించారు.  

 

 మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు హైలెవల్ కెనాల్ అవసరమని నిపుణులు తేల్చారు. అప్పట్లోనే రూ.100 కోట్లతో సోమశిల అధికారులు అంచనాలు రూపొందించారు. ఇంతలో వైఎస్సార్ ఆకస్మికంగా మృతిచెందారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు రూ.785 కోట్లతో మొదట అంచనాలు సిద్ధం చేశారు. అనంతరం వాటిని రూ.1,585 కోట్లకు పెంచారు. మొదటి విడతగా రూ.785 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. గతేడాది ఏప్రిల్ 2న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ వద్ద శంకుస్థాపన చేశారు.

 

 తొలివిడతలో సోమశిల నుంచి మర్రిపాడు మండలం ప్రగల్లపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. జనవరిలో టెండర్ల ప్రక్రియ చేపట్టి మార్చిలో ముగించారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ తక్కువ మొత్తానికి టెండర్ దాఖలు చేయగా, ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. చంద్రబాబు అధికారం చేపట్టి నెల గడిచినా హైలెవల్ కాలువ పనులు ప్రారంభించకపోవడంపై మెట్ట ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top