మాఫీపై మాట తప్పిన బాబు

మాఫీపై మాట తప్పిన బాబు - Sakshi


 సాక్షి, కడప : రైతులను, డ్వాక్రా మహిళలను రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటతప్పారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. నరకాసురవధ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండోరోజైన శుక్రవారం కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పలు చోట్ల ఆందోళనా  కార్యక్రమాలు నిర్వహించారు.

 

 పజలను మోసం చేసిన బాబుకు పాలించే అర్హత లేదని.. నిలువునా రైతులను మోసం చేశారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురంలో ఆయన మాట్లాడుతూ  షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలనిడిమాండు చేశారు.పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఆందోళనలను అడ్డుకోవడం తగదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళనలు  చేస్తున్నా.. పోలీసులు ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికలకు ముందు ఒకమాట.. తర్వాత మరొక మాట మాట్లాడటం బాబుకు తగదని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి హితవు పలికారు.

 

 రాజుపాలెంలో ఉద్రిక్తత.. రాచమల్లు అరెస్టు :

 ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెంలో శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను తగులబెడుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేయడంతో ఒకదశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రాచమల్లును అరెస్టు చేసి రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.

 

 తహశీల్దార్‌కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ దేవగుడి :

 డ్వాక్రా మహిళలకు, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయాలంటూ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్లి తహశీల్దార్‌కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

 అలాగే తొండూరులో మండల పరిశీలకుడు రామమునిరెడ్డి, యూత్ కన్వీనర్ శివశంకర్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో  వెఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ఆర్‌ఐకి వినతి పత్రం అందజేశారు. రైల్వేకోడూరులో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద పట్టణ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పూర్తి రుణ మాఫీని అమలు చేయాలని కోరారు.

 

 ధర్నా చేసిన ఎమ్మెల్యే జయరాములు

 బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జయరాములు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేతోపాటు మాజీ జడ్పీటీసీ నాగార్జునరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు  చిత్తా బ్రదర్స్‌తో కలిసి భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం  తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top