రూపురేఖలు మారుస్తా

రూపురేఖలు మారుస్తా - Sakshi


సాక్షి  ప్రతినిధి, ఒంగోలు : జిల్లా రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కొండపిలో సోమవారం జరిగిన రైతు సాధికారత సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేస్తానని, దొనకొండ, కనిగిరిలను పారిశ్రామికవాడలుగా, కనిగిరిలో సోలార్ విద్యుత్తు తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. తాను ముందుగా ప్రకటించిన విధంగా విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్శిటీ వచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.



ఒంగోలు స్మార్ట్ సిటీ అంశాన్ని ప్రస్తావించ లేదు. పాలేరు రిజర్వాయర్ అడిగారని, దీనికి రూ. 65 కోట్లు ఖర్చవుతుందని చెప్పారని, దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత మంజూరు చేస్తానని చెప్పారు. మూలపాడు, మర్రిపాడు రిజర్వాయర్‌కు రూ.20 కోట్లు ఖర్చవుతుందని, దీనివల్ల టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి మండలాలకు తాగునీటి సమస్య తీరుతుందని, దీన్ని మంజూరు చేస్తానని చెప్పారు. కొండపి చుట్టూ రింగ్ రోడ్డు కావాలని అడిగారని, దీన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తానని చెప్పారు.  టంగుటూరు నుంచి పొదిలికి, కొండపి నుంచి కమ్మపాలెం వరకూ రెండులైన్ల రోడ్డు అడిగారని దీన్ని కూడా మంజూరు చేస్తానని చెప్పారు.



సాగు నీటి కోసం వెలుగొండ ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీల నీటిని విడుదల చేస్తే జిల్లా మెట్ట ప్రాంతం సస్య శ్యామలమవుతుంది. నాగార్జున సాగర్ ఫేజ్ -2 ద్వారా కందుకూరు, కొండపి, ఉదయగిరికి నీరు అందిస్తాం... జిల్లాలో ఫ్లోరైడు అధికంగా ఉంది. భూగర్భ జలాలుపైకి వస్తే దీన్ని అరికట్టగలం, నీరు - చెట్టు కార్యక్రమానికి అందరూ సహకరించాలని అన్నారు. ఆ తర్వాత రైతు ప్రతినిధులు కలిసి కౌలు రైతులకు రుణమాఫీ, శనగల కొనుగోలు, సుబాబుల్ కొనుగోలుకు సంబంధించి విజ్ఞాపనలు అందజేశారు. కౌలు రైతుల విషయంలో సానుకూలంగా స్పందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.



ఆర్బీఐ అంగీకరించకపోయినా, రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ముఖ్యమంత్రి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశారని కొనియాడారు. తొలుత ఆయన జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. మీ సేవా విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గరికి వెళ్లి రైతు రుణమాఫీకి సంబంధించి అందిస్తున్న సర్వీసు వివరాలను, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక్కో గ్రూపునకు ఐదుగురు చొప్పున ఏర్పాటు చేసిన మూడు గ్రూపులకు ట్రాక్టర్లు, దుక్కి యంత్రాలు, విత్తనాలు నాటే పరికరాలు పంపిణీ చేశారు. హెలీఫ్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల బండిపై ముఖ్యమంత్రి వచ్చారు.



హుద్‌హుద్ తుపాను బాధితులకు పలువురు విరాళాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు రూ.68 లక్షలు విరాళం అందజేయగా, మార్కాపురం జర్నలిస్టులు రెండు లక్షల రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సభకు డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున స్కూల్ బస్సుల్లో తరలించారు. ఈ సదస్సు అనంతరం ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉన్నా, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి చెందడంతో సమీక్షా సమావేశం రద్దు చేసుకుని ముఖ్యమంత్రి తిరుపతి బయలుదేరి వెళ్లారు.

 

జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు ఇవ్వరూ

ఒంగోలు సబర్బన్: కొండపిలో రైతు సాధికారత సదస్సుకు విచ్చేసిన చంద్రబాబు నాయుడుకు ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తదితరులు రూ. 2 లక్షల చెక్కును అందిస్తూ ఆరోగ్య బీమా కార్డుల విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య బీమా కింద ఇచ్చే హెల్త్ కార్డులను త్వరితగతిన విలేకరులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు ఐవీ సుబ్బారావు వివరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట శంకర్ హత్యకు సంబంధించి విచారణ ముమ్మరం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని కూడా కోరారు. సీఎంను కలిసిన వారిలో జిల్లా కార్యదర్శి వేటపాలెం శ్రీనివాస్, కోశాధికారి డి.కనకయ్యతోపాటు పలువురు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top