అయోమయం బాబు.. గందరగోళం జవాబు

అయోమయం బాబు.. గందరగోళం జవాబు - Sakshi


మీడియా ప్రశ్నలపై చంద్రబాబు దాటవేత, తత్తరపాటు

విలేకరులపై ఆగ్రహం, అసహనం

ఏపీ భవన్‌లో మధ్యాహ్నం ప్రారంభమైన దీక్ష

దీక్ష దేనికోసమంటే.. నోరెళ్లబెట్టిన టీడీపీ అధినేత


 

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన దీక్ష దేనికోసం..? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్ కోసమా? లేక తెలంగాణ ఏర్పాటును సమర్థించడానికా? సోమవారం ఇదే ప్రశ్నను మీడియా సమావేశంలో విలేకరులు పలుసార్లు అడిగినప్పటికీ చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. ఈ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తూ ఆసాంతం తత్తరపడ్డారు. ఒకదశలో మీడియాపైనే ఆగ్రహం ప్రదర్శించారు. అయినా మీడియా పదేపదే మీ వైఖరేంటని అడగడంతో చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టాయి. ఏం చెప్పాలో తెలియక.. ‘నేనేదో చెప్పబోతుంటే మీరేంటి అలా అడగటం..’ అన్నట్టు అసహనం ప్రదర్శించారు. ఉన్నట్టుండి నమస్కారం అంటూ సమావేశం నుంచి నిష్ర్కమించే ప్రయత్నం చేశారు. నిరాహార దీక్ష చేయడానికి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చేరుకున్న చంద్రబాబు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందు తెలుగులో మాట్లాడిన చంద్రబాబు తర్వాత వాటినే ఆంగ్లంలో పునరుద్ఘాటించారు. మీ దీక్ష దేనికోసం అంటూ మీడియా పదేపదే ప్రశ్నించడంతో తట్టుకోలేక ఆగ్రహం, అసహనం ప్రదర్శించారు.

 

 విలేకరుల సమావేశంలో చంద్రబాబు సమాధానాలివీ..

 ప్ర: మీ మద్దతు సీమాంధ్రకా..? లేక తెలంగాణకా? మీ వైఖరి ఏమిటి?

 బాబు: మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు?

 విలేకరి: ఇద్దరు.

 బాబు: వారిలో ఒకరిని ఎంపిక చేస్తారా?

 వి: ఎందుకు చేయను. చేస్తాను.

 బాబు: నేను అలా చేయను. న్యాయం కోసం ఇక్కడకు వచ్చాను. ఒకవేళ మీకు ఇద్దరు, లేదా ముగ్గురు పిల్లలు ఉంటే, ఒక పిల్లవాడి వైపు చెప్పరు.

 వి: పేద పిల్లలను చూడాలి.

 బాబు: నేను అందరు పిల్లలను సమానంగా చూస్తాను. పిల్లలందరికి న్యాయం చేస్తాను. అది నా వైఖరి. అందరికి తెలుసు. కానీ కాంగ్రెస్ తీరు వేరు. ఓ వైపు టీఆర్‌ఎస్‌తొ పొత్తు పెట్టుకుంటుంది విలీనం చేసుకుంటుంది. ఇంకోవైపు సమైక్యాంధ్ర అంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుటుంది. కాంగ్రెస్ మురికి రాజకీయాలు చేస్తోంది.

 ప్రశ్న: 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి వైఖరి మార్చుకోవడంలో అర్థమేమిటి?

 బాబు: మీరు అర్థం చేసుకోవాలి. లేఖను ఉపసంహరించుకుంటున్నట్టు నేనెప్పుడూ చెప్పలేదు. సమస్యకు పరిష్కారం చూపాలన్నాను. కాంగ్రెస్ ప్రజాస్వామ్య, రాజ్యాంగ నిబంధనలను అనుసరించి అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒక ప్రాంతానికి అన్యాయం చేయకూడదు. నన్ను విమర్శించటం సరికాదు.

 ప్రశ్న: టీఆర్‌ఎస్ తెలంగాణను కోరుతోంది, వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రను కోరుకుంటోంది. మీ పార్టీ వైఖరి ఏమిటి?

 బాబు: మీరు ఈ ప్రశ్ననే పదేపదే అడుగుతున్నారు. మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరిని కోరుకుంటారు? ఇది కాంగ్రెస్ గేమ్‌ప్లాన్.

 ప్రశ్న: మీ పార్టీ వైఖరేమిటి?

 బాబు: న్యాయం చేయాలి

 ప్రశ్న: న్యాయం అంటే ఏమిటి?

 బాబు: (సమాధానాన్ని దాటవేశారు)

 ప్రశ్న: మీ వైఖరిలో స్పష్టత లేదు?

 బాబు: ఏమి క్లారిటీ కావాలి.

 ప్రశ్న : మీరు తెలంగాణకు అనుకూలమా.. వ్యతిరేకమా?

 బాబు: మీరు అది అడగకూడదు (కోపంగా). రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలి.

 ప్రశ్న: న్యాయం అంటే మీ దృష్టిలో అర్థమేమిటి?

 బాబు: రెండు ప్రాంతాల జేఏసీలను, భాగస్వాములను పిలవాలి. వారితో చర్చించాలి.

 ప్రశ్న: మీరు సూచించే పరిష్కారం ఏమిటి?

 బాబు: ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి భవిష్యత్‌లో ఎవరు బాధ్యత వహిస్తారు.

 ప్రశ్న: సీమాంధ్రలో సమస్య పరిష్కారానికి మీరే ం సూచన చేస్తారు?

 బాబు: ప్రభుత్వాన్ని అడగండి. అధికారంలో ఉంది వారే. నేను ఏదైనా సూచన చేస్తే దాన్ని రాజకీయం చేస్తారు.

 ప్రశ్న: మీరు తెలంగాణకు అనుకూలమా, వ్యతిరేకమా?

 బాబు: నేను తెలుగు ప్రజల కోసం ఉన్నాను. నా లేఖ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ప్రభుత్వం ఒక ప్రాంతానికి అన్యాయం చేయకూడదు. ఒక ప్రాంతానికి అన్యాయం ఎలా చేస్తారనే నేను అడుగుతున్నా.

 ప్రశ్న: కాంగ్రెస్ ప్రభుత్వం మీ డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు మీరే కదా కాపాడింది?

 బాబు: కాంగ్రెస్‌తో జగన్ రహస్య డీల్ చేసుకున్నారు. మేం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం.

 ప్రశ్న: మీ డిమాండ్ ఏమిటి?

 బాబు: ముందుగా సమస్యను పరిష్కరించాలి.

 ప్రశ్న: మీరు విభజనకు అనుకూలమా?

 బాబు: జేఏసీలను పిలిచి చర్చించాలి.

 ప్రశ్న: ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందంటున్నారు. అది ఏది?

 బాబు: సీమాంధ్రకు అన్యాయం జరిగింది. న్యాయం చేయాలి

 ప్రశ్న: అయితే తెలంగాణ పరిస్థితి ఏమిటి?

 బాబు: ఒకేసారి ఇలా చేస్తే ఎలా? హైదరాబాద్, నీటి సమస్య, ఉపాధి, విద్య సమస్యలున్నాయి వాటిని పరిష్కరించాలి.

 ప్రశ్న: హైదరాబాద్‌ను ఏమి చేయాలంటారు?

 బాబు: అందరినీ పిలిచి మాట్లాడాలి.

 ప్రశ్న: 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తే తప్పేముంది?

 బాబు: నేను తప్పుపట్టడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవడం, సమాజహితాన్ని పణంగా పెట్టడం సరికాదు.

 ప్రశ్న: రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చే ముందు మీకు సీమాంధ్ర ప్రజల సమస్యల గురించి తెలియదా?

 బాబు: నేను ఏమి చెబుతున్నానంటే.. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పాటించాలి. ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదు. సమస్య అంతటా వారు ఎలా వ్యవహరించారో చూడండి. దేశంలో ఏపీ భాగం కాదా. ఆసోం, పంజాబ్, బెంగాల్‌లో కూడా అలానే చేశారా. 72 రోజులుగా చర్చలకు పిలవలేదు. వారు నిసృ్పహలో ఉన్నారు.

 ప్రశ్న: జేఏసీలను పిలిచి చర్చించకపోతే మీ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా?

 బాబు: మా వారు మొదట్నుంచీ అదే చేస్తున్నారు.

 ప్రశ్న : ఈ అంశంపై మీ తుది వైఖరి ఏమిటి?

 బాబు: నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఏదైనా సలహా ఇస్తే దాన్ని రాజకీయం చేస్తారు. నన్ను విమర్శిస్తారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో మేం మొదటి స్థానంలో వచ్చాం. అందుకే రాజకీయంగా నన్ను అంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ప్రజలపై కోపంతో ఇలా చేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి  ఇలా చేస్తున్నాయి.

 ప్రశ్న: విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వటం వల్ల మీరు తగిన లబ్ధి పొందంటం లేదని బాధపడుతున్నారా?

 బాబు: నేను అలా బాధపడటం లేదు. నేను పోరాడతాను. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తాను. ఓకే.. మంచిది.. మంచిది.. ధన్యవాదాలు.

 ప్రశ్న: ఎన్‌డీఏ చివరిసారి అధికారంలో ఉన్నపుడు మీరు కీలక పాత్ర పోషించారు. గతంలో మూడోఫ్రంట్ కోసం మీరు ముందుండి పనిచేశారు. అయితే ఎస్‌పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మూడోఫ్రంట్‌కు సంబంధించిన ప్రస్తావనలో మీ పేరెత్తలేదు? మోడీతో సమావేశం అవడం వల్లే మీ ప్రస్తావన రాలేదంటారా?

 బాబు: మూడుసార్లు కాంగ్రెస్ వ్యతిరేక యునెటైడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు మిషన్ కోసం వచ్చాను. రాజకీయాల గురించి మాట్లాడను. పొత్తులపై తగిన సమయంలో మాట్లాడతాను.

 

 శరద్‌యాదవ్, ఏచూరి సంఘీభావం

 మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ భవన్‌లో చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. దీక్షకు తరలివ చ్చిన పార్టీ నేతలకు ఏపీ భవన్‌తో పాటు పలు హోటళ్లు, అతిథి గృహాల్లో వసతి ఏర్పాటు చేశారు. బాబు తొలిరోజు దీక్షకు ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కాంట్రాక్టులు నిర్వహించే పార్టీ నేతలు తమ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని తరలించి సంఘీభావం ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు. దీక్షలో కూర్చున్న చంద్రబాబుకు ఎన్‌డీఏ మాజీ కన్వీనర్ శరద్‌యాదవ్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి సంఘీభావం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top