మనం చెప్పినచోటే

మనం చెప్పినచోటే - Sakshi


కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రాజధాని అంటూ మంత్రివర్గ భేటీలో చంద్రబాబు ప్రకటన

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు. రైతులు భూములు అప్పగించేందుకు సంసిద్ధతను వ్యక్తంచేస్తే గుంటూరు జిల్లా మంగళగిరిలో లేదంటే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్న కృష్ణా జిల్లా  నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నూజివీడు వద్ద సుమారు 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చంద్రబాబు మంత్రులకు తెలిపినట్లు సమాచారం.

 

 నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ పి.నారాయణలతో ఈ ఉపసంఘం ఏర్పాటైంది. రాజధాని ఏర్పాటుకు ఎక్కువ భూమి కావాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. రాజధానికి అవసరమైన భూమిని సేకరించే బాధ్యతను మంత్రివర్గ ఉపసంఘం తీసుకోవాలని సూచిం చింది. రైతులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించి భూములిచ్చేలా వారిని ఒప్పించాలని చెప్పింది. ఈ మంత్రివర్గ సమావేశం వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. మీడియాకు లీకుల ద్వారా మాత్రమే వివరాలను అందించింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేస్తానని బాబు చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రాజధాని అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తొలుత మంత్రి అచ్చెన్నాయుడు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు.

 

 రాజధానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోందని, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా వెంటనే ఒక స్పష్టత ఇస్తే మంచిదని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ , వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట నిర్మించాలని సమావేశంలో మంత్రులు సూచించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నూతన రాజధానికి నిధుల కోసం కేంద్రం వద్దకు వెళితే కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోండని చెప్పేందుకు వీలుగా దానిని రూపొందించినట్లు కనపడుతోందని కొందరు మంత్రులు చెప్పారు. ఈ కమిటీ నివేదిక అడ్డదిడ్డంగా ఉందని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించవచ్చు. కానీ అధికార వికేంద్రీకరణ సాధ్యం కాదని స్పష్టంచేశారు.


 


ప్రజాప్రతినిధులు, ప్రజలు రాజధానికి వచ్చినప్పుడు వారి పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్లాలని చూస్తారని, ఒక్కో శాఖలో పని కోసం ఒక్కో ప్రాంతానికి వెళితే వారి సమయం, డబ్బు వృథా అవుతాయని తెలిపారు. అందువల్ల ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఒకే చోట కేంద్రీకరించాలని సూచించారు. మంత్రుల అభిప్రాయాలు విన్న సీఎం చంద్రబాబు.. రాజధానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఎవరూ ప్రకటనలు చేయొద్దని ఆదేశించారు. శివరామకృష్ణన్ కమిటీకి విలువే లేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలోని అంశాలను తప్పు పట్టా రు. ఈ నివేదిక మరిన్ని సందేహాలు లేవెనె త్తేదిగా ఉందని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అభివృద్ధితోపాటు అధికార వికేంద్రీకరణ చేయాలని కమిటీ సూచించిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమే కాని, అధికార వికేంద్రీకర ణ సరికాదని అభిప్రాయపడ్డారు. విజయవాడకు సమీపంలోనే రాజధాని ఉంటుందని చెప్పారు. రైతులు భూములు అప్పగించేందుకు ముందుకు వస్తే మంగళగిరిలో రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ రైతులు వాటిని అప్పగించేందుకు ముందుకు రాకపోతే కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో నూతన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. కృష్ణా నదికి ఇరువైపులా అభివృద్ధి చేస్తానని వివరించారు.

 

 విజయవాడకు శ్రీకాకుళం, తిరుపతి, కడప, అనంతపురం తదితర నగరాలు, పట్టణాలు సమానదూరంలో ఉన్నాయని వివరించారు. అలాగే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి హంద్రీ నీవా కింద 12 ఎత్తిపోతల పథకాలు ఉంటే అందులో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని, వీటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వారికి అప్పగిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. రాజధానిని ప్రకాశం జిల్లాలో  ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో పరిశీంచాలని ఒక మంత్రి సూచించగా.. మిగిలిన మంత్రులతో పాటు చ ంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. శివరామకృష్ణన్  కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు మరో కమిటీ వేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ జరిగింది. దీనిపై మంగళవారం అసెంబ్లీలో ప్రకటన సందర్భంగా సీఎం వివరాలు వెల్లడించే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రుల పనితీరు ఇంకా మెరుగు పడాల్సి ఉందని సీఎం చెప్పారు. ప్రధానమైన అంశాలపై చర్చ సందర్భంగా కొందరు సరైన సమాచారంతో రావటంలేదని, ఆ పరిస్థితిని నివారించాలని అన్నారు. మంత్రులు వారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సభకు సక్రమంగా హాజరు కావటంతో పాటు చర్చల్లో పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలు, అన్న కేంటీన్ల ఏర్పాట్లపైన కూడా చర్చ జరిగింది.

 

 కేబినేట్‌లో ఆమోదించిన ఇతర అంశాలు...

 

 త్వరలో ప్రకటించే డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థుల వయో పరిమితి 40 సంవ త్సరాలకు పెంపు

  ఎయిడె డ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంపు

 

 రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనువుగా మంత్రివర్గం నిర్ణయం

 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల పాలకవర్గాల పదవీ కాలం మూడు  నుంచి రెండు సంవత్సరాలకు కుదింపు

 

  ఆదాయాన్నిబట్టి దేవాలయాల పాలకవర్గాలు ఏర్పాటు. రూ.5 కోట్ల లోపు ఆదాయమున్న దేవాలయాలకు తొమ్మిది మందితో, రూ.5 కోట్ల నుంచి రూ. 15 కోట్ల లోపు ఆదాయం ఉంటే 11 మందితో, రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్య ఆదాయం ఉంటే 15 మందితో, తిరుమల తిరుపతి దేవస్థానం మినహా రూ. 20 కోట్లకు పైగా ఆదాయం ఉన్న ఇతర దేవస్థానాలకు 19 మందితో పాలకవర్గాల నియామకం.  

 

 పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంలో అనుమతి

 

 విశాఖపట్నం జిల్లాలో ఎన్టీపీసీ ఏర్పాటు చేసే 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్  కేంద్రానికి 1,200 ఎకరాల భూమి కేటాయింపు

 టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీకి ఆమోదం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top