దోషం ఉందంటూ దోచేసింది

దోషం ఉందంటూ దోచేసింది

  • 12 కాసుల నగలతో   ఉడాయించిన మాయ‘లేడి’

  •  లబోదిబోమంటున్న బాధితులు

  • శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రంపంచ అగ్ర రాజ్యాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా అక్కడక్కడ మూఢనమ్మకాలు రాజ్యమేలు తున్నాయి. అమాయక సామాన్యజనాన్ని నట్టేట ముంచుతూనే ఉన్నాయి.

     

    కైకలూరు : ఇంట్లో దోషం ఉందంటూ నమ్మించి 12 కాసుల నగలు, రూ. 9వేలుతో ఉడయించిన మహిళ ఉదంతం బుధవారం వెలుగులోకి వచ్చింది. సినీఫక్కీలో జరిగిన ఈ దొంగతనం పట్టణంలో కలకలం రేపింది. స్థానిక వెలంపేటలో పోలన సతీష్, భార్య గౌరి, తల్లి, సోదరుడితో కలసి నివసిస్తున్నారు. వారం రోజుల క్రితం గౌరి వద్దకు ఓ మహిళ వచ్చి ముఖంపై పెద్ద బొట్టు, చేతిలో సంచితో ఓ మహిళ రావడం చూశారా అని ప్రశ్నించింది. గౌరి ఏవరని అడిగింది.



    ఆమె మా ఇంటిలో దోషాలను పరిష్కరించిందని, ఆమె కనిపిస్తే కొవ్వూరు నుంచి ఓ మహిళ వచ్చిందని చెప్పండని నమ్మించి వెళ్లిపోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గౌరి వద్దకు నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకున్న ఓ మహిళ వచ్చింది. ఆమె కరక్కాయిలు, మూలికలు అమ్ముతానని చెప్పింది. దీంతో గౌరీ వారం రోజుల కిత్రం చెప్పిన మహిళ అనుకుని లోపలికి రమ్మంది. ఇంట్లోకి వెళ్లిన ఆ మాయలేడి గోడపై ఉన్న ఫొటోను చూసి చేతబడి చేయడం వల్లే ఆయన చనిపోయారని చెప్పింది.   



    చేతబడి నివారణకు వివాహం కాని బ్రాహ్మణుడితో పూజలు చేయించాలని, ఆయనకు ఎటువంటి డబ్బులు ఇవ్వకూడదని నమ్మబలికింది. గౌరి అమాయకంగా డబ్బులు తీసుకోకుండా ఎవరు పూజ చేస్తారని అడగడంతో 10 నిముషాల్లో నేను చెస్తానని ఆమె చెప్పింది. ఇంట్లో బియ్యం తీసుకురమ్మని నగలు ఉంచాలని కోరింది. తూకం రాయి చూపించి బరువు సరిపోలేదని డబ్బు ఉంచాలని కోరింది. పుసుపు, కుంకుమతో పూజ చేసి డబ్బాలో నగలు, డబ్బును ఉంచింది. దానిపై తాయత్తలు కట్టి దేవుడి పూజ గదిలో ఉంచాలని చెప్పింది.



    ఈ విషయం మరుసటి రోజు ఉదయం వరకు ఎవరికీ చెప్పకూడదని, పూజ చేసి నగలు, డబ్బులు తీసుకోవాలని చెప్పింది. నమ్మకం కలగడానికి తన పేరు నాగమ్మ అని కొవ్వూరులో డోర్ నెంబరు 101లో నివాసముంటున్నానని, అక్కడకు వచ్చి నా పేరు చెబితే ఇంటికి తీసుకొస్తారని చెప్పి ఊడాయించింది. మరుసటి రోజు ఉదయం  గౌరి  బాక్సు తీసి చూస్తే బియ్యం మాత్రమే అందులో ఉన్నాయి.



    మోసపోయానని గుర్తించిన గౌరి విషయాన్ని ఇంటిలో చెప్పింది. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగలకు మెరుగు పెడతాం, దోషాలను నివారిస్తాం అంటూ వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top