దొంగ.. దొంగ

దొంగ.. దొంగ - Sakshi


♦ మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే భయం..భయం

♦ ఇళ్లకు తాళాలు వేసి వెళితే అంతే!

♦ దేవాలయాలను సైతం దోచుకుంటున్న దుండగులు  

♦ పోలీసులకు సవాల్‌గా మారిన దొంగతనాలు

 

 క్రైం ( కడప అర్బన్ ) : జిల్లాలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు మొద లుకుని ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల వరకు ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని దోచుకెళ్తున్నారు. చివరకు దేవుడి కొలువును సైతం వదలడం లేదంటే దొంగలు ఎంతగా బరితెగిస్తున్నారో అర్థమవుతోంది.



  ఒంటరిగా మహిళలు దేవాలయాలకు, పాఠశాలలకు, మార్కెట్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారు. మోటార్‌సైకిల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో నుంచి బంగారు చైన్‌లను నిర్దాక్షిణ్యంగా లాక్కెళుతున్నారు. దేవాలయాలను సైతం వదిలిపెట్టడం లేదు. హుండీలను పగులగొట్టడం, దేవుని ఆభరణాలను దోచుకెళ్లడం రోజూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంది. ఇళ్లకు తాళాలు వేసి తమ అవసరాలకోసం వేరే పట్టణాలకు, నగరాలకు వెళితే వాటినే లక్ష్యంగా చేసుకుని తాళాలను సులభంగా పగులగొట్టి ఇళ్లలోకి జొరబడి ఆభరణాలను దోచుకెళుతున్నారు.



  2013 నుంచి 2015 జూన్ చివరి వరకు జరిగిన చోరీలు, దోపిడీలు. జరిగిన నష్టం, రికవరీల వివరాలను పరిశీలిస్తే ఇటీవల జరిగిన కొన్ని దొంగతనాల వివరాలు ఇలా ఉన్నాయి



  కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన సురేంద్రారెడ్డికి గుజరాత్ రాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ బంగారాన్ని ఇచ్చి రూ. 10 లక్షలను కాజేశారు. ఆ ముఠాలో ఒకరిని ఇటీవల సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.  



  చెన్నూరులోని రెడ్డివారివీధిలో నివాసముంటున్న పెడబల్లె లలితమ్మ అనే మహిళ వద్దకు వెళ్లి బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెట్టిస్తామని చెప్పి మోసం చేసి గాజులతో ఉడాయించారు.



  కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో కేవలం రెండు రోజుల్లో మూడు ప్రదేశాల్లో చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి.



  ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెన్నానది తీరంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల9వ తేది దొంగలు 8 కిలోల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అలాగే హత్యరాల త్రేత్రేశ్వరస్వామి దేవాలయంలో దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు.



  ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో ఉన్న టీచర్స్ కాలనీలో టీఆర్ మణి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి వెళ్లగా దొంగలు 12 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.



  నందలూరు దళితవాడలో గుండు సురేష్ ఇంటిలో దొంగ లు 13 తులాల బంగారు ఆభరణాలు, రూ. 21 వేల నగదు దోచుకెళ్లారు.



  ఈనెల 13వ తేదిన పాత బస్టాండులో బస్సు ఎక్కుతున్న చాగలమర్రి మండలం పగుళ్లపాడుకు చెందిన రామలింగారెడ్డి జేబును కత్తిరించి మూడున్నర తులం నల్లపూసల దండను దొంగిలించారు.



  కడప నగరం రవీంద్రనగర్ ఈనెల 23- 25 తేదీల మధ్యలో పర్వీన్ అనే మహిళ ఇంటి తాళం పగులగొట్టి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.



  ఈనెల 29 తేదీన నబీకోటలో ఇంటి తాళం పగులగొట్టి 50 తులాలు బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు దోచుకెళ్లారు.



 ఇలా దొంగలు నిర్భయంగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దొంగతనాల నివారణపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top