అడ్డదారితో అసలుకే ఎసరు

అడ్డదారితో అసలుకే ఎసరు - Sakshi


 ఏలేశ్వరం : ‘ఏరు దాటే వరకూ బోటు మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య’ అన్న రీతిలో వ్యవహరించిన అవకాశవాదానికి భంగపాటు తప్పలేదు. పదవి కోసం పార్టీ ఫిరాయించిన ఆ నాయకురాలు చివరికి ‘రెంటికీ చెడక’ తప్పలేదు. హెచ్చరిఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచి, తర్వాత   టీడీపీ ప్రలోభాలకు లొంగి, చైర్‌పర్సన్ పదవిపై వ్యామోహంతో ఆ పార్టీలోకి ఫిరాయించిన కొప్పాడ పార్వతిపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె చైర్‌పర్సన్, కౌన్సిలర్ పదవులను కోల్పోయారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, ఇందిరాసాగర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఎల్.విజయసారథి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ కేటీ సుధాకర్ గురువారం తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

 

 ఏలేశ్వరం నగర పంచాయతీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో చైర్‌పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీకి పది, వైఎస్సార్ సీపీకి తొమ్మిది, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. టీడీపీకి ఆధిక్యత ఉన్నా చైర్‌పర్సన్ పదవిని చేపట్టడానికి ఆ పార్టీ తరఫున ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందలేదు. ఎస్సీ మహిళలకు కేటాయించిన రెండు వార్డుల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. వీటితో పాటు మరో రెండు జనరల్ వార్డుల నుంచీ ఆ పార్టీకే చెందిన ఎస్సీ మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ఈ పరిణామంతో టీడీపీ అనైతికంగానైనా చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవడానికి సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎస్సీ మహిళా కౌన్సిలర్లను తన వైపు తిప్పుకొనేందుకు ప్రలోభాలు పెట్టింది. చివరికి ఆరో వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన కొప్పాడ పార్వతి పార్టీ ఫిరాయించి, టీడీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీనిపై వైఎస్సార్ సీపీ విప్ సామంతుల శ్రీరామసూర్యకుమార్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఎన్నికల అధికారి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్వతిపై అనర్హత వేటు వేశారు.

 

 వైఎస్సార్ సీపీలో ఆనందోత్సాహాలు

 చైర్‌పర్సన్ పార్వతిపై అనర్హత వేటు పడడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. స్థానిక బాలాజీ చౌక్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. చివరికి న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేశారు. పార్టీ నేతలు అలమండ చలమయ్య, సామంతుల సూర్యకుమార్, బదిరెడ్డి గోవిందు, మలకల వేణు, వాగుబలరామ్, దాకమర్రి సూరిబాబు, తొండారపు రాంబాబు,  పతివాడ బాబూరావు, గంగిశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు వాడపల్లి శ్రీను, బదిరెడ్డి అశాలత, గొడత చంద్ర, భజంతుల మణి, ఎస్‌ఎం సుభానీ, వరుపుల నె హ్రూ, కోసూరి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top