కథలు చెప్పొద్దు!

కథలు చెప్పొద్దు!


సాక్షి, అనంతపురం :

 ‘నాకు కాకమ్మ కథలు చెప్పకండి.. మీ సంగతి నాకు మొత్తం తెలుసు.. అసలు మీ వల్లే శాఖకు చెడ్డపేరు వస్తోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ గురించి బయట ఎవర్ని కదిపినా ఒకటే మాట..అవినీతి.. అవినీతి.. ఎందుకిలా? అంతా మీ వల్లే.. నిబంధనలను తుంగలో తొక్కి మీ ఇష్టానుసారం టెండర్లు పిలవడం, నాసిరకం సరుకులు కొనడం.. రివ్యూ మీటింగ్‌లలో మేము ప్రశ్నిస్తే మా కళ్లకు గంతలు కట్టాలని చూస్తారు.. మరోసారి నేను జిల్లాకు వచ్చినప్పుడు అవినీతి అనే మాట వినిపించిందా.. చెప్పను చేసి చూపిస్తా’ అంటూ స్త్రీ శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన తర్వాత అనంతపురం చేరుకున్న ఆమె డ్వామా హాలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మైనింగ్ శాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. తొలుత స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి.. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా సీడీపీఓల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు మీ ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచారు. అయితే మీరు మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా మేడమ్.. సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి.. గుడ్లు మురిగిపోతున్నాయి.. సైజు చిన్నగా ఉంటున్నాయి అన్న ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. కనీసం మీ జిల్లాలోనైనా ఆ ఫిర్యాదులు రాాకుంటే బాగుంటుందని అని అనుకుంటే ఇక్కడా అవే ఫిర్యాదులు. సీడీపీవోలు క్షేత్ర స్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లోనే కూర్చుంటున్నారు. అది ఇక కుదరదు. ప్రతి ఒక్క సీడీపీఓ కచ్చితంగా క్షేత్ర స్థాయికి వెళ్లి కేంద్రాలను పరిశీలించాలి. మీరు వెళ్తే కదా.. కేంద్రాలకు కార్యకర్తలు వస్తున్నారా? లేదా? అని తెలిసేది. మీరు వెళ్లరు.. వారు కేంద్రాలకు రారు.. పని భారమంతా ఆయాలపై వదిలేసి ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ కూర్చుండిపోతున్నారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ.. వారిని కేంద్రాలలో లబ్ధిదారులుగా చేర్పించాలి.

 వారితో పాటు చిన్నారులకు పౌష్టికాహారం సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి కాన్వెంట్లుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే మీరేమో.. వాటిని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అసలు కేంద్రాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించాలని ఎవరు చెప్పారు? అన్ని కేంద్రాలను ఒకే దృష్టితో చూడండి.. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యతగా ఉండేలా చూడండి’ అంటూ మంత్రి ఆదేశించారు. ‘జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు.. అయినా మీకు బొత్తిగా భయం అనేది లేకుండా పోయింది. మీరు కూడా ఐసీడీఎస్ పనితీరుపై సిబ్బందితో సమీక్షలు జరుపుతూ ఉండండి’ అంటూ అక్కడే ఉన్న కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని 10 ప్రాజెక్టుల పరిధిలో అమలవుతున్న అమృతహస్తం పథకం ద్వారా గర్బిణీలు, బాలింతలకు సకాలంలో సరుకులు అందజేయాలని, సరుకుల్లో నాణ్యత లోపించినట్లు తెలిస్తే.. ఇక అంతే అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సరుకుల్లో నాణ్యత లోపించినా, గుడ్ల సైజు తగ్గినా వెంటనే కాంట్రాక్టర్‌ను ప్రశ్నించాలన్నారు. నెలకు 2 కోట్ల కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారే.. వాటిలో ఎన్ని బాగున్నాయో ఏనాడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలకు సంబంధించి నిధులు మంజూరు చేయించిన వెంటనే కలెక్టర్‌తో సంప్రదించి, అవసరమై స్థలసేకరణ చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీరు బాగా పనిచేయండి.. మీకు ఏం కావాలో మాకు చెప్పండి.. ఏం చేస్తే శాఖపై ఉన్న అవినీతి మరక పోతుందో చెప్పండి.. మేం స్వీకరిస్తాము. నాకు కావాల్సింది ఒక్కటే.. ఇకపై స్త్రీశిశుసంక్షేమ శాఖలో అవినీతి అనే మాటకు తావుండకూడదు. మీరు బాగా పనిచేయండి..నాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి’ అని మంత్రి సూచించారు.

 ఈ సందర్బంగా ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం శాఖలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లోనే కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. 118 మంది హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top