మాచర్ల–నల్గొండ రైల్వే లైను కుదరదు :కేంద్రం


న్యూఢిల్లీః మాచర్ల–నల్గొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేమని కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు స్పష్టం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ఈ రైల్వేలైనును 1997–98 బడ్జెట్‌లో రూ. 125 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారని, ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 815 కోట్లు అని తెలిపారు. సర్వే తుది దశలో ప్రజా ప్రతినిధులు ఈ మార్గాన్ని మార్చాలని సూచించారని, ఇదే సందర్భంలో దీనిపై రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జరిపిన యోగ్యత అధ్యయనం ఈ ప్రాజెక్టులో ఆర్థిక యోగ్యత లేదని తేల్చిందని వివరించారు.

 

స్పెషల్‌పర్పస్‌ వెహికిల్‌ విధానంలో గానీ, పీపీపీ విధానంలో గానీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చారు. ప్రజల్లో ఈ డిమాండ్‌ ఉన్నప్పటికీ నిధుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, కానీ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయలేదని వివరించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top