అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మోసగిస్తారు: పవన్

అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మోసగిస్తారు: పవన్ - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెన్నాళ్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తాయని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యేలా మాట్లాడతారని.. కానీ పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ మాట మీద నిలబడలేకపోయారని ప్రశ్నించారు. మంగళగిరిలో చేనేతల సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై మాట్లాడారు. ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నామో.. దాని సాధ్యాసాధ్యాలు ఏంటో వివరించి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని ఒకసారి చెప్పారని.. మళ్లీ అది అవసరం లేదని అంటున్నారని, ఇలా పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే సమస్యల మీద ఎదురు నిలబడి పోరాడగల నాయకులు కావాలని అన్నారు. యువ నాయకులు, పోరాటపటిమ ఉన్నవాళ్లు, నిస్వార్థపరుల కోసం చూస్తున్నానని తెలిపారు. ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్లే నాయకులని, దాన్ని దోపిడీచేసే వాళ్ల మీద ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

 
చేనేతన్నలను కార్మికులు అంటే ఊరుకోనని, చేనేత కళాకారుడంటేనే ఒప్పుకొంటానని పవన్ అన్నారు. చిన్నతనంలో తాను చీరాలలో ఉండేవాడినని, అప్పుడు తమ ఇంటి పక్కన చేనేత కుటుంబాలుండేవని చెప్పారు. వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో, వాళ్లు పస్తులు ఎలా ఉంటారో, స్కూలు ఫీజులు కట్టడానికి పడే ఇబ్బందులు, క్యారేజిలో అటుకుల్లాంటివి మాత్రం తెచ్చుకోవడం అన్నీ తనకు గుర్తున్నాయని తెలిపారు. చేనేత ఆధారిత పరిశ్రమలకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానంటే వడ్డించే వాళ్లను వదిలేసి విస్తరాకులు ఎత్తుకునేవాళ్ల దగ్గరకు వెళ్లడం ఏంటని కొంతమంది తనను కించపరిచారని, కానీ అసలు చెత్తను శుభ్రపరిచేవాళ్లే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. వాడుకకు బాగున్నాయి కదాని సామెతలు ఎలా పడితే అలా వాడితే కులాలను కించపరిచినట్లవుతుందని హెచ్చరించారు. సినీ పరిశ్రమకు పైరసీ లాగే.. చేనేతను దోచుకుంటున్న పారిశ్రామికవేత్తలను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. వీళ్లకు రావల్సిన ఆదయానికి పవర్ లూమ్స్ ద్వారా గండికొడుతున్నవాళ్లను నియంత్రించకపోతే ఈరోజు సత్యాగ్రహం చేస్తున్నారు, రేపు రోడ్లమీదకు రాకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుందని అన్నారు. చేతుల్లో కళ ఉండి పస్తులుండాల్సిన దుస్థితి చాలా దయనీయమని, పది మందికీ జీవనోపాధి కల్పించగల నైపుణ్యం ఉన్నవాళ్లు చివరకు కూలీలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, తెలంగాణ ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అండగా నిలబడతామని చాలా చెప్పారు గానీ.. ఇల్లు అలకగానే పండగ కాదన్నారు. ప్రభుత్వాలు చెప్పినా, వాళ్లు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూసేందుకు ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటుచేసుకోవాలని, అప్పుడే వాళ్లను ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
క్రీడాకారులకు ఇస్తున్నట్లే చేనేత కళాకారులకు కూడా వ్యక్తిగత కళా నైపుణ్యాలను ప్రోత్సహించేలా నగదు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లంతా వారానికి కనీసం ఒక్కసారి చేనేత కట్టాలని, మన పంచె, మన కట్టు మర్చిపోకూడదని కోరారు. గాంధీజీ వడికిన చేనేతను కాపాడేందుకు ఆఖరి శ్వాస వరకు నిలబడదామని పిలుపునిచ్చారు. అన్నం పెట్టే రైతు, బట్టలు నేసే నేతన్న కన్నీళ్లు పెడితే దేశం సుభిక్షంగా ఉండదని తెలిపారు. ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే బిడ్డలు బాగుంటారని చేనేత కుటుంబాలు కోరుకుంటున్నాయని, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తే మంచిదని సూచించారు. పెద్దనోట్ల రద్దువల్ల స్వర్ణకారుల వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వాళ్లకు కూడా తాను మద్దతుగా ఉంటానని తెలిపారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top