సిమెంట్ ముసుగులో అక్రమ రవాణా

సిమెంట్ ముసుగులో అక్రమ రవాణా - Sakshi


- యథేచ్ఛగా టీడీపీ నేతల దందా

- రెండు భారీ లారీలను పట్టుకున్న పోలీసులు

- వాటిని వదిలి పెట్టాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి  

సాక్షి కడప/పులివెందుల :
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. ఆదాయం వస్తుందంటే చాలు ఎక్కడైనా దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎర్రచందనం, ఇసుక లాంటి ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు.  అడ్డంగా దొరికిపోయినప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తూ ఆనక దర్జా ఒలకబోస్తున్నారు. వీరి దందాను ఎవరైనా అడ్డుకుంటే సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శించడం జిల్లాలో నిత్య కృత్యంగా మారింది. ప్రస్తుతం చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను బెంగుళూరు, చెన్నై, ప్రకాశం జిల్లాలకు తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.  

 

పంథా మార్చిన నేతలు

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇసుక తరలింపులో పలువురు కొత్త పంథాను అవలంభిస్తున్నారు. ఇంతవరకు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తూ వచ్చిన అక్రమార్కులు.. ప్రస్తుతం 18 టైర్ల భారీ లారీల్లో సిమెంటు లోడు తరహాలో టార్ఫాలిన్ పట్టాలు కట్టి.. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. సుమారు 30 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ లారీల్లో ఏకంగా 50 టన్నుల మేర ఇసుకను నింపి తరలిస్తున్నారు. కొండాపురం నుంచి ఏపీ04టీటీ 6939, ఏపీ04టీటీ 7668 అనే నెంబర్లు గల లారీలలో బెంగళూరుకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి పులివెందుల జేఎన్‌టీయూ వద్ద ఎస్‌ఐ వెంకటనాయుడు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.



సోమవారం రెవెన్యూ అధికారులకు అప్పగించారు.  ఈ అక్రమ రవాణా టీడీపీ నేతల పనేనని తెలిసింది. ఈ లారీలు కూడా కొండాపురానికి చెందిన ఓ టీడీపీ నేతవని సమాచారం. పోలీసులు పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలని పులివెందుల టీడీపీ నేతలు స్థానిక పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. లారీల్లో ఇసుకను తరలిస్తూ... ఆటోలలో ఇసుకను తీసుకెళుతున్నట్లు చలానాలు చూపించినట్లు సమాచారం. ఈ లారీల వెనుక మరో రెండు లారీలు వస్తుండగా.. పట్టుబడిన లారీల్లోని వారు ఇచ్చిన సమాచారంతో ఆ లారీలు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top