సెల్‌ఫోన్ లేకుంటే పెన్షన్ కట్!

సెల్‌ఫోన్ లేకుంటే పెన్షన్ కట్!


పింఛనుకు ఫోన్ నంబర్ లింక్

వచ్చే నెల నుంచి విధిగా అమలు పేదల్లో ఆందోళన


 

‘నీ సెల్‌ఫోన్ నంబరు చెప్పు..’

‘నాకు ఫోను లేదు బాబయ్యా..’

‘ఫోను లేకపోతే నీకు పింఛను రాదు..’

‘అదేంటి బాబూ.. ఫోను కొనుక్కునే స్తోమత నాకెక్కడిది?’

‘వెంటనే ఫోన్ నంబరు తీసుకురా.. లేకుంటే వచ్చే నెల నుంచి నీ డబ్బులు రావు..’



ఇదీ తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంలో గురువారం పింఛనుదారులకు, సీఎస్పీకి మధ్య జరిగిన సంభాషణ.

 నడవలేక, లేవలేక, నా అనేవారు లేక, ఇతరులపై ఆధారపడలేక ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి పింఛనుతో నెలంతా గడుపుకునే పేదలకు సెల్‌ఫోన్ విధిగా ఉండాలని నిబంధన అమలుచేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధుమేహం, రక్తపోటుతో పాటు వృద్ధాప్యం కారణంగా వచ్చే పలు వ్యాధులతో సతమతమవుతూ ఆస్పత్రులు, మందుల షాపుల చుట్టూ తిరిగే పేదలు చాలీచాలని పింఛన్లతో సెల్‌ఫోను కొనుక్కోవడమెలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



సెల్‌ఫోను కొనే స్తోమత మాకెక్కడిది?



నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పింఛను చెల్లిస్తున్నామని, ఇకపై పెన్షనుదారులందరూ సెల్‌ఫోను నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతుండటం పేదలకు పుండుపై కారం చల్లినట్లుంది. సెల్‌ఫోను కొనాలంటే కనీసం రెండువేల రూపాయలు కావాలని, నెలకు రూ.200 నుంచి రూ.300 బిల్లు చెల్లిస్తేనే ఫోను పనిచేస్తుందని, ఇంత ఖర్చు చేసి తాము సెల్‌ఫోను నిర్వహించవలసిన అవసరమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా ముఖ్యమంత్రి నేరుగా పింఛనుదారులతో మాట్లాడతారని, పింఛను వారికి మంజూరవగానే సెల్‌ఫోనుకు సంక్షిప్త సందేశం వస్తుందని అధికారులు చెబుతుండటంతో ఇటువంటి గిమ్మిక్కులను మానుకోవాలని, లేకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని పలువురు పింఛనుదారులు సూచిస్తున్నారు.



ఇదెక్కడి నిబంధన...



ఇచ్చే అరకొర పింఛనులో సెల్‌ఫోను నిర్వహించాలని అధికారులు సూచించడం తగదని తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్లు రామవరపు లక్ష్మణరావు, చిట్టిపోతుల లక్ష్మీనారాయణ, ఏరువ ప్రకాష్‌రెడ్డి, చిలపరపు హేమలత, షేక్ నదియా పేర్కొన్నారు. ఇటువంటి అర్థం లేని నిబంధనలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కంటే మరింత మెరుగైన మార్పులు చేసి ప్రతినెలా పింఛన్లు అందేవిధంగా చూడాలని హితవు పలికారు. జన్మభూమి ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛనుదారులందరూ సెల్‌ఫోన్లు కలిగి ఉండాలని, లేనివారికి తామే ఇస్తామని చెప్పినందున అధికారులు పింఛనుదారులను ఒత్తిడి చేయవద్దని కూడా పలువురు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top