సీఈపై బదిలీ వేటు

సీఈపై  బదిలీ వేటు


పంతం నెగ్గించుకున్న కమిషనర్

డిప్యుటేషన్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీకి

జీతభత్యాలు మాత్రం జీవీఎంసీలోనే..

కమిషనర్‌పై ఫైర్..  తేల్చుకుంటానన్న సీఈ


 


కోల్డ్‌వార్‌కు  ఎట్టకేలకు తెరపడింది. సీఈపై బదిలీ వేటు పడింది. కమిషనర్‌దే పైచేయి అయ్యింది. కొంతకాలంగా ఈయన బదిలీపై వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ బదిలీ ఉత్తర్వులు అందాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వలవెన్‌కు సాంకేతిక సలహాదారుగా సీఈ దుర్గాప్రసాద్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. జీతభత్యాలు మాత్రం జీవీఎంసీలోనే తీసుకునేలా ఆదేశాలిచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో సీనియరైన సూపరింటెండింగ్ ఇంజనీర్(వర్క్స్) చంద్రయ్యకు సీఈగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.




విశాఖపట్నం: జీవీఎంసీలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్, సీఈ దుర్గాప్రసాద్‌ల మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. పలు అంశాల్లో తలెత్తిన ఈ విభేదాలు ఆధిపత్యపోరుకు తెరతీశాయి. చీఫ్ ఇంజనీరింగ్‌గా దుర్గాప్రసాద్ 2014 నవంబర్ 14న జీవీఎంసీకి రాగా 2015 ఫిబ్రవరిలో కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్ వచ్చారు. ఆదిలో సఖ్యతగానే మెలిగిన వీరిద్దరి మధ్య తర్వాత ఆధిపత్యపోరు మొదలైంది. జీవీఎంసీలో తాను ఎవరి కిందా పనిచేయడం లేదని.. ఎవరి ఆదేశాలు పాటించనవసరం లేదంటూ సీఈ తరచూ కమిషనర్‌పై ఒంటికాలిపై లేచేవారనే విమర్శలున్నాయి. వివిధ పనులకు సంబంధించి టెండర్ల ఖరారు సమయంలో కూడా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకోవడం, వద్దన్న పనులు చేస్తుండడంతో సీఈ, కమిషనర్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇంజినీరింగ్ సెక్షన్‌లో ఏ పనికైనా సరే కమిషనర్ సంబంధిత సూపరింటెంటెండింగ్ ఇంజనీర్లతో మాట్లాడేవారే తప్ప సీఈతో మాట్లాడటం దాదాపు మానేశారు.


 

ఏడాదిగా మరింత ముదిరి..


గత ఏడాదిగా ఈ విభేదాలు మరింత ముదిరి.. కోల్డ్‌వార్‌గా మారింది. ఈ తరుణంలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారంటూ బీచ్‌రోడ్‌లోని రాజీవ్ స్మృతి భవన్‌ను కోట్ల రూపాయలు ఖర్చుచేసి నేదునూరి కృష్ణమూర్తి స్మారక మందిరంగా సీఈ దుర్గాప్రసాద్ తీర్చిదిద్దారు. తనకు చెప్పకుండా ఎలా చేస్తారంటూ అప్పట్లో కమిషనర్ సీఈపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఏలేరు నీటిపంపింగ్ కోసం టెండర్లు పిలవగా సింగిల్ టెండరే దాఖలైనప్పటికీ కనీసం కమిషనర్‌కు చెప్పకుండా కమిటీ కూర్చొని ఫైనలైజ్ చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకున్న కమిషనర్ వెంటనే ఆపేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ తర్వాత చీఫ్ ఇంజనీర్ పోస్ట్ జీవీఎంసీలోనే ఉందని.. ఈఎన్‌సీ తర్వాత పోస్ట్‌లో ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వకుండా.. కలుపుకొని పోకుండా కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈ కూడా తరచూ ఆవేదనకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్‌పై ఫిర్యాదుల వెల్లువెత్తడంతో పాటు బదిలీ చేసేందుకు ఉన్నత స్థాయిలో మమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక దశలో సీఈని సరెండర్ చేసేందుకు కమిషనర్ తీవ్రంగానే ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో వందల కోట్ల పనులు జరుగనున్న నేపథ్యంలో అధికారుల మధ్య కోల్డ్‌వార్ మంచిది కాదన్న వాదన కూడా బలంగానే విన్పించింది. తనపై బదిలీ వేటు పడకుండా సీఈ తీవ్రంగానే ప్రయత్నించినప్పటికీ ఈ నెల 15న కమిషనర్ మరో లేఖ రాశారు. చీఫ్ ఇంజనీర్‌ను బదిలీ చేయాలని, ఖాళీగా ఉన్న సీఎంహెచ్‌వో పోస్ట్‌ను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 24 గంటల్లో వస్తున్న సమయంలో సీఈని బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. కాగా ఇప్పటికే సీఎంహెచ్‌వో పోస్ట్ ఖాళీగా ఉండగా తాజాగా సీఈ పోస్టు కూడా ఖాళీ అయ్యింది.


 


ప్రిన్సిపల్ సెక్రటరీది  ఏకపక్ష నిర్ణయం

కమిషనర్ ప్రవీణ్‌కుమార్ లేఖపై ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవెన్ ఎలాంటి విచారణ జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి బ్రిటీష్ పాలనలో ఉన్నామా? .. స్వతంత్ర భారతంలో ఉన్నామా? అన్న అనుమానం నాకు కలుగుతోంది. మున్సిపల్ శాఖలో ఏకైక చీఫ్ ఇంజనీర్ నేనే. సెక్రటరీ స్థాయిలో లాబీయింగ్ జరిపి నిబంధనలకు విరుద్ధంగా నాకంటే జూనియర్ అయిన జయరామిరెడ్డిని జీవీఎంసీలో సీఈగా గతంలో కొనసాగించారు. అదేవిధంగా మరోసారి నాకంటే జూనియర్ అధికారికి అందలం ఎక్కించేందుకు  కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సెక్రటేరియట్ స్థాయిలో లాబీయింగ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నేను వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. కనీసం ఐదేళ్ల వరకు ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. కమిషనర్ వైఖరిపై ఇదివరకే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశా.  -ఎన్.దుర్గాప్రసాద్,     చీఫ్ ఇంజనీర్, జీవీఎంసీ


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top