కదులుతున్న డొంక

కదులుతున్న డొంక


 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇప్పటికే 51 స్టాట్యుటరీ విచారణ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీసీసీబీలో అక్రమాల డొంక కదులుతోంది. విచారణలో అక్రమాలు  తేలితే అటు గరుగుబిల్లి మండలం రావివలస సొసైటీ అధ్యక్షురాలిగా ఇటు డీసీసీబీ(జిల్లా కేంద్రసహకార సంఘం) చైర్‌పర్సన్‌గా ఉన్న మరిశర్ల తులసి పదవులకు ముప్పు వాటిల్లినట్లేనని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు పలువురు భావిస్తున్నారు.   రావివలస సొసైటీలో తమపేరున  బినామీ రుణాలు  కోట్లాది రూపాయల మేర తీసుకున్నారని ఆ సొసైటీ పరిధిలోని పలువురు(రైతులు) సభ్యులు రోడ్డెక్కారు. ఎప్పటినుంచో కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేయాలని కాచుక్కూర్చున్న టీడీపీ నేతలకు ఆ రైతులు అస్త్రంగా మారారు. దీంతో విషయం అధికారుల దృష్టికొచ్చింది. బినామీ రుణాల కింద పెద్ద ఎత్తున  కాజేశారన్న  అభియోగాలతో  సెక్షన్ 51 స్టాట్యుటరీ విచారణ చేపట్టారు. అక్రమార్కులకు సహకరిస్తున్న కొందరు టీడీపీ నాయకులు వ్యవహారాన్ని ఎక్కడ నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారేమోనని కసిగా ఉన్న టీడీపీ నాయకులు విషయాన్ని ఏకంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

 

 51స్టాట్యుటరీ విచారణ ఇలా..

 సొసైటీ పరిధిలో రుణ రికార్డుల్లో  ఉన్న రైతులందరికీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మీ పేరున ఫలానా మేర రుణం తీసుకున్నట్టు రికార్డుల్లో ఉందని, వాస్తవమో కాదో తమ వద్దకొచ్చి తెలపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా స్పం దించకపోతే రికార్డుల్లో పేర్కొన్న మేరకు రుణం తీసుకున్నట్టుగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో నోటీసులందుకున్న వారంతా రోడ్డెక్కారు. తామంతా రుణం తీసుకోలేదని కొందరు, తమ పేరున సెంటు భూమి లేకుండానే రూ.75వేలు ఇవ్వడమేంటని పీఏసీఎస్‌ను ముట్టడించి అధికారులను నిలదీశారు. దీంతో సంబంధిత అక్రమార్కులకు గుబులు పట్టుకుంది.

 

 చివరి ప్రయత్నంగా ఎంతైతే బినామీ రుణంగా తీసుకున్నారో ఆ మొత్తమంతా తామే చెల్లించేస్తామని, అవసరమైతే అందుకు అదనంగా కొంత ఇస్తామని రైతులకు ఎరచూపే ప్రయత్నం కూడా చేసినట్టు తెలిసింది.అయినా బాధితులు దారికి రాలేదు. విచిత్రమేమిటంటే 15రోజులుగా రాద్ధాంతం జరుగుతున్నా కాంగ్రెస్ నేతలెవ్వరూ తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించలేదు. దీన్నిబట్టి హేండ్సప్ అనేశారేమో అన్పిస్తోంది. 51 స్టాట్యుటరీ విచారణే సీరియస్ అనుకుంటే ఇప్పుడేమో సర్కార్ ఏకంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. దీంతో రావివలస సొసైటీ పరిధి నేతల భవితవ్యం బినామీ రుణ బాధితుల చేతుల్లో ఉంది.  రోడ్డెక్కి  ఆగ్రహాన్ని తెలియజేస్తున్న రైతులు దారికొచ్చే పరిస్థితి లేదు. ఇక డీసీసీబీపై విచారణలో అక్రమాలు బయటపడితే అందులో పనిచేసిన అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే సందర్భంలో జిల్లాలోని మిగతా సొసైటీల్లో కూడా అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top