కూలీలే బలి పశువులు!


రాయదుర్గం : ఇసుక దందాల్లో అధికార పార్టీ నేతలు లాభపడుతుండగా... బలవుతోంది మాత్రం పొట్ట కూటి కోసం కూలికి వెళ్తున్న బడుగు జీవులు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అసలు దొంగలు దొరల్లా తిరుగుతున్నారు. కూలీలు మాత్రం కేసుల్లో ఇరుక్కొంటున్నారు. దీనివల్ల వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకుని.. 15 మందిని అరెస్టు చేసిన విషయం విదితమే.

 

 వీరందరూ కర్ణాటక ప్రాంతానికి చెందిన కూలీలే. ఇంతటితో పోలీసులు చేతులు దులుపుకున్నారు. కీలక పాత్రధారి అయిన కర్ణాటకకు చెందిన మంజును ఇంత వరకు పట్టుకోలేదు.  ఓ అధికార పార్టీ ముఖ్యనేత జోక్యం వల్ల ఈ కేసు విచారణలో పురోగతి కన్పించలేదన్న విమర్శలున్నాయి. ఈ సంఘటన వెలుగులోకి వచ్చి 48 గంటలు కాకముందే ఇదే నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలంలో టీడీపీ ఎమ్పీటీసీ సభ్యుడి పొలంలో 50 ట్రిప్పుల ఇసుక డంపింగ్ బయటపడింది. ఇక్కడ ఇసుకను ఇతరులు డంపింగ్ చేశారంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసులను నిష్పక్షపాతంగా విచారించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తూతూమంత్రంగా విచారణ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులే నిందితుల పేర్లు వెల్లడించి, ఆ వ్యక్తులను సైతం పట్టుకోకపోవడం ఈ విమర్శలకు బలం చేకూర్చుతోంది. రచ్చుమర్రి ఇసుక కుంభకోణంలో కణేకల్లు మండలానికి చెందిన ముఖ్య నేతల హస్తం ఉందని ఆ మండల ప్రజలు కోడై కూస్తున్నా.. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. వారితో సత్సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి ద్వారా కేసును నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొమ్మనహాళ్ మండలంలో కూడా కర్ణాటక సరిహద్దున కొంత మంది టీడీపీ నేతలు ఇసుక డంపింగ్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు.  రాయదుర్గం మండలంలోనూ ఇదే పరిస్థితి.

 

 నేతలకు చీవాట్లు పెట్టిన ఎమ్మెల్యే!

 తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నానని, ఇసుక దందాను బట్టబయలు చేసి పరువుతీశారంటూ ఆయా మండలాల నేతలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అవాక్కైన నేతలు కేసులను నీరుగార్చే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top