ప్రేమకు అడ్డుగోడగా కులం

భాస్కర్‌రెడ్డిని నిలదీస్తున్న శైలజాకుమారి


వింజమూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కులం పేరుతో తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ యువతి నిరసనకు దిగింది. భర్త ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వీరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పించ డంతో కథ సుఖాంతమైంది. వివరాలు...



అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన శైలజాకుమారి 2004లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్థానిక ఎంఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివింది. అదే కళాశాలలో చదువుతున్న సూరా భాస్కర్‌రెడ్డి, శైలజాకుమారి ప్రేమించుకున్నారు. డిగ్రీ అనంతరం ఉన్నత చదువుల కోసం శైలజ తిరుపతికి, భాస్కర్‌రె డ్డి హైదరాబాద్ వెళ్లారు. మధ్యమధ్యలో భాస్కర్‌రెడ్డి తిరుపతికి వె ళ్లి ఆమెతో మాట్లాడివస్తుండే వాడు. 2010లో శైలజ ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు.



ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో కులాలు వేరయినందున తల్లిదండ్రులను నెమ్మదిగా ఒప్పించి చేసుకుంటానని నమ్మించాడు. మరోవైపు అదే ఏడాది తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో భాస్కర్‌రెడ్డి ఖర్చులు భరించి ఆమెకు హైదరాబాద్‌లో వైద్యం చేయించాడు. చివరకు 2013 జూన్‌లో తిరుపతిలోని శ్రీనివాసమంగాపురంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట హిందూపురం, తర్వాత నెల్లూరులో కాపురం పెట్టారు. అనంతరం క్రమేణా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు.



అదే సమయంలో భాస్కర్‌రెడ్డికి మరోపెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శైలజకుమారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి వింజమూరు చేరుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నేతలతో కలిసి ఆదివారం రాత్రి నుంచి భాస్కర్‌రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్న భాస్కర్‌రెడ్డిని నిలదీసి, తనకు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. చివరకు వీరి వివాహాన్ని మంగళవారం రిజిస్టర్ చేసేందుకు ఒప్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top