24 మంది పోలీసులపై కేసు నమోదు

24 మంది పోలీసులపై కేసు నమోదు


తిరుపతి: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎట్టకేలకు కేసు నమోదైంది. బాధితుల ఆందోళన, హక్కుల సంఘాల నిరసనల మధ్య ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 24 మంది పోలీసులపై కిడ్నాప్, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్పుల్లో మృతి చెందిన శశికుమార్ భార్య మునియమ్మాళ్ ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్‌కౌంటర్ బూటకం కాదంటున్న రాష్ట్ర పోలీసు అధికారగణం.. నలుదిశలా కమ్ముకుంటున్న ఆరోపణల నుంచి ఏవిధంగా బయటపడాలా? అని ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక, బుధవారం నాటి పరిణామాలు పోలీసులను మరింత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఘటనలో పాల్గొన్న వారిపై హ త్య, కిడ్నాప్ కింద కేసులు నమోదు చేశామంటూ పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించడం, తమ ప్రతివాదిగా బాధితుల్లో ఒకరైన మునియమ్మాళ్ పేరును చేర్చడంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దీనికి తోడు బాధితురాలు మునియమ్మాళ్ సైతం రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇకపై జరిగే పరిణామాల ఆధారంగా  కేసు నుంచి బయటపడాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలతో తాత్కాలికంగా ఆందోళనలు అదుపు చేయవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని బాధితులను మభ్యపెట్టి తమవైపు తిప్పుకునేలా వ్యూహం రూపొందించడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

 ఉన్నతాధికారుల చర్చలు

 పోలీసులపై కేసు నమోదైన నేపథ్యంలో ఎన్‌కౌంటర్ గండం నుంచి గట్టెక్కేందుకు ఉన్నతాధికారులు నానాతిప్పలు పడుతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతిలోనే మకాంవేసి కేసులో తమచేతికి మట్టి అంటకుండా ఉండేలా వ్యూహరచన చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో డీఐజీ కాంతారావు, సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, కేసు విచారణాధికారి త్రిమూర్తులు సమావేశమై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతోనూ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్టు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top