కాలుష్య కాసారం

కాలుష్య కాసారం


ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్న గుంటూరు ఛానల్ (కాలువ) కాలుష్యంతో నిండి పోతోంది. ప్రజారోగ్యానికి హాని కలిగిస్తోంది. గుర్రపు డెక్క, చెత్త చెదారంతో పాటు మురుగు నీరు కలిసి ఛానల్ పూర్తిగా కలుషితమవుతోంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్య ఫలితమే ఛానల్‌కు ఈ దుస్థితి దాపురించిందనే  విమర్శలు బాహాటంగానే

 వినిపిస్తున్నాయి.


 

 చినకాకాని(మంగళగిరి రూరల్):  కృష్ణా జలాలను మోసుకు వచ్చే గుంటూరు ఛానల్ తాడేపల్లి వద్ద ప్రారంభ మై గుంటూరు వరకు వెళుతోంది. దాదాపు 27 కిలోమీటర్ల విస్తరించి తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు రూరల్ మండలాలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తోంది. ప్రధానంగా మంగళగిరికి సమీపంలోని ఆత్మకూరు, చినకాకాని, కాజ వరకు ఛానల్‌లోకి వ్యర్థాలు చేరుతుండడంతో కలుషితమవుతోంది.



     మంగళగిరి మునిసిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల నుంచి వచ్చే చెత్తాచెదారం, మురుగు నీరు సైతం ఈ ఛానల్‌లోనే కలుస్తున్నాయి.



      ఏటా ఛానల్‌లో పేరుకుపోతున్న గుర్రపుడెక్కను అధికారులు మొక్కు బడిగా తొలగిస్తున్న కారణంగా వర్షాకాలంలో గండ్లు పడి పంట పొలాలు మునిగిపోతున్నాయి.

 47 గ్రామాలకు దాహార్తి తీరుస్తూ...



      గుంటూరు ఛానల్ 47 గ్రామాల దాహార్తి తీరుస్తోంది. దీని ద్వారానే గ్రామాల్లోని చెరువులు నిండుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాల ద్వారా నిత్యం తాగునీటి సరఫరా జరుగుతోంది. అంతేకాక, నాలుగు మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతోంది.



      ఇలా తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్న గుంటూరు ఛానల్ నిత్యం కాలుష్యంతో నిండి వుంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కాలుష్యం పెరుగుతోందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.



 మంగళగిరి పట్టణం నుంచి మురుగు

     మంగళగిరి పట్టణం నుంచి వచ్చే మురుగు నేరుగా గుంటూరు ఛానల్‌లో కలుస్తోంది. దీంతో పంట కాలువ కాస్తా మురుగు కాలువగా మారుతోందని రైతులు వాపోతున్నారు.

      మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రి ఎదుట నుంచి మునిసిపాలిటీకి చెందిన మురుగు, చెత్తాచెదారం సైతం గుంటూరు ఛానల్‌లో కలసిపోతోండటంతో తాగునీరు కలుషితమై వ్యాధులు సోకుతున్నాయని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 వ్యర్థాలు కలవకుండా చూడాలి...

 గుంటూరు ఛానల్‌లో వ్యర్థాలు కలవకుండా నీటి పారుదల శాఖ, డ్రైనేజి శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజల దాహార్తి తీరుస్తూ, పొలాలకు సాగునీరు అందిస్తూ ఎంతో ఉపయోగ పడుతున్న కాలువను శుభ్రపరిచి కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి.

 - కె.శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు, చినకాకాని

 

 పంట పొలాలు సైతం మునిగిపోతున్నాయి...

 వర్షాకాలంలో డ్రైనేజి నీరు ఛానల్‌లో కలవడంతో పంట పొలాలు సైతం మురుగునీటిలో మునిగిపోయి రైతులు నష్టపోతున్నారు. తాగునీరు సైతం కలుషితమయంగా మారడంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.

  - మర్రి వెంకటేశ్వరరావు, రైతు, చినకాకాని

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top