కేర్ సొసైటీ డెరైక్టర్ల అరెస్టు

కేర్ సొసైటీ డెరైక్టర్ల అరెస్టు - Sakshi

  •       పరారీలో ఐదుగురు

  •      సుమారు రూ.8 కోట్లకు కుచ్చు టోపీ

  •      డెరైక్టర్ల స్వప్రయోజనాలకు నిధుల వినియోగం

  •  విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కోట్లాది రూపాయలు దిగమింగిన కేర్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను మహారాణిపేట జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి, భద్రతల డీసీపీ ఎం. శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. సొసైటీ నిర్వహణలో లోటుపాట్లతో సుమారు రూ.8 కోట్లకు దివాళా తీసింది. దీంతో సొసైటీ సభ్యులు 400 మంది వరకు వీధిన పడ్డారు.



    మహారాణిపేట జోన్ పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి.. 15 ఏళ్ల క్రితం రామ్‌నగర్, రెడ్నం గార్డెన్స్‌లో ఎంఎస్‌ఎన్ రెడ్డి అధ్యక్షుడుగా, ఉపాధ్యక్షుడుగా పి.రామ్‌మోహనరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి.మల్లికార్జునరావు,  నాగమల్లేశ్వరరావు, సీహెచ్. విజయలక్ష్మి, ఎం. గీతాలక్ష్మి, ఆర్.చంద్ర కాంత్  డెరైక్టర్లుగా కేర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటె డ్ పేరిట సంస్థను ప్రారంభించారు.



    డిపాజిట్లు ద్వారా సుమారు రూ.7కోట్లు వసూలు చేశారు. 2007లో సొసైటీ అధ్యక్షుడుగా వ్యవహరించిన సీహెచ్‌వీ సుబ్బారావు ఎటువంటి షూరిటీలు లేకుండా డెరైక్టర్లలో ఒకరైన పి.వి.నాగమల్లేశ్వరరావుకు రూ.1.5 కోట్లు రుణం మంజూరు చేశారు. అప్పటి నుంచి దఫదఫాలుగా రూ.3.5 కోట్ల వరకు స్వప్రయోజనాలకు వాడుకున్నాడు.  



    సొసైటీ అతనిపై కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్‌లో 2011లో కేసు వేసింది. సొసైటీ అధ్యక్షుడు సుబ్బారావు రూ.40 లక్షలు, అతని కుమారుడు ప్రసాద్‌కు, అకౌంటెంట్, కోశాధికారి అయిన ఆర్.సతీష్, అతని సోదరుడు ఆర్.చంద్రకాంత్, అతని స్నేహితుడు సోమా కనస్ట్రక్షన్స్ ప్రతినిధి ఎ.సతీష్‌లకు ఎటువంటి పత్రాలు లేకుండా రూ.95 లక్షలు రుణం ఇచ్చారు.  



    కాలపరిమితి దాటిన డిపాజిట్లు చెల్లంపు చేయకపోవటంతో సొసైటీ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.  కేసు నమోదు చేసి సుమారు రూ.8 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.  సొసైటీ మెంబర్ గొంప అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన కోర్డు డెరైక్టర్ నాగమల్లేశ్వరరావుకు చెందిన రూ.2.41కోట్ల విలువ చేసే పూర్ణామార్కెట్ వద్ద వాణిజ్యసముదాయం స్వాధీనం చేసుకున్నారు.  



    సొసైటీ మెంబర్లకు రూ.2కోట్ల వరకు మార్టుగేజ్ లోన్లు, లోన్లు ఇచ్చిన వారి ఆస్తులను గుర్తించారు. సంస్థకు చెందిన అన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన డైరె క్టర్లతో పాటు వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ డెరైక్టరు నాగమల్లేశ్వరరావు, ఆర్.చంద్రకాంత్, అకౌంటెంట్ అండ్ క్యాషియర్ ఆర్.సతీష్, జానియర్ అసిస్టెంట్ ప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఈస్ట్ ఏసీపీ డి.ఎన్.మహేష్, మహారాణిపేట సిఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్‌ఐ ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top