రాజధాని నడిమధ్యన ఉండాలి: వైఎస్ జగన్‌

రాజధాని నడిమధ్యన ఉండాలి: వైఎస్ జగన్‌ - Sakshi


కనీసం 30,000 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండే చోటే నిర్మించాలని ఏపీ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన

సమృద్ధిగా మంచి నీటి లభ్యత అవసరం

విశాలమైన నగరం అయితేనే అందరికీ గృహ వసతి కల్పించగలం

రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేస్తోంది

కృష్ణా-గుంటూరు మధ్యన నెలకొల్పినా వివాదాస్పదమే అవుతుంది

రోడ్ల విస్తరణ కోసం ప్రజల విలువైన స్థలాన్ని తక్కువ పరిహారంతో సేకరిస్తోంది


 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాష్ట్రం నడి మధ్యన ఉండాలని, కనీసం 30 వేల ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండే చోటే నిర్మించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్ బుధవారం పలు జాతీయ టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి ప్రధానంగా మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రం నడిమధ్యన రాజధాని ఉండాలి. 30 వేల ఎకరాల ఖాళీ స్థలం ఉండే చోట నిర్మించాలి. సమృద్ధిగా మంచి నీటి లభ్యత ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ అంశాలనే ప్రధానంగా చూసుకోవాలి’ అని చెప్పారు. సీఎం చంద్రబాబు మాత్రం ఒక నిర్దేశిత ప్రాంతంలోనే రాజధాని రావాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఆయనే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

‘రాజధాని ఎక్కడైనా పెట్టండి. మాకు అభ్యంతరం లేదు, అయితే కచ్చితంగా రాష్ట్రం నడిమధ్యన ఉండేలా చూడండి. కనీసం 6 కిలోమీటర్ల వ్యాసార్థం గల ప్రదేశంలో ఎటు చూసినా ఆరు కిలోమీటర్ల పొడవున రాజధాని విస్తరించి ఉండాలి. ఎందుకంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి ముఖ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి. 12 కిలోమీటర్ల పొడవు అంటే 144 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని నగరం నిర్మించే విధంగా ఉండాలి. దీన్ని ఎకరాల్లోకి మారిస్తే కనీసం 30 వేల ఎకరాలవుతాయి. విశాలమైన నగరం ఉంటే గానీ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ(పేదలు) నివాస వసతి కల్పించలేం. స్థలం లేకుంటే ఇరుకైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ లేక ఇబ్బందులు పడతాం. అందుకే తగినంత భూమి లేని చోట రాజధాని నిర్మించడం ఏమాత్రం సమంజసం కాదు’ అని జగన్ పేర్కొన్నారు.

 

వారికి లభించే పరిహారం పిసరంతే!: ‘చంద్రబాబు స్వయంగా సింగపూర్‌లాంటి రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. సింగపూర్ 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరం 960 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. నూతన రాజధాని నిర్మించుకోవడానికి కనీసం 144 చదరపు కిలోమీటర్లయినా కావాలి కదా?’ అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ ఏమీ అడగలేదని.. అంతా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ప్రతిపాదనలపై ప్రశ్నించగా.. ‘అక్కడ పెట్టినా వివాదాస్పదమే అవుతుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా అక్కడి వారు తమ ఇళ్లను కోల్పోవాల్సి ఉంటుంది. రోడ్లను వెడ ల్పు చేసే కార్యక్రమంలో భాగంగా వారి అనుమతి లేకుండానే ప్రజల ఖరీదైన స్థలాలను ప్రభుత్వం తీసుకోవచ్చు. దానికి బదులుగా వారికి లభించే పరిహారం పిసరంతే ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

 

ఇళ్లు కోల్పోయిన వారు ఇంకొక చోట కొనాలన్నా సాధ్యమయ్యే పనికాదు. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యన రాజధాని ఏర్పాటు చేయాలన్నా కనీసం 30 వేల ఎకరాల ఖాళీ స్థలంతో ముందుకు వస్తే మంచిది. రాష్ట్రం నడిమధ్యన లేకుంటే మాత్రం అది రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. ఈ విషయంలో ఇప్పుడేదో తొందరలో చేసేసి.. ఆ తరువాత చింతించినా ప్రయోజనం ఉండదు’ అని జగన్ చెప్పారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నూతన రాజధానికి అవసరమైతే నిర్దేశించిన స్థలాలను డీనోటిఫై చేయడానికి కూడా అవకాశం కల్పించారు కనుక దీన్ని సైతం ఉపయోగించుకోవాలని సూచించారు.

 

 జగన్ గుంటూరు పర్యటన రద్దు


 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే రుణమాఫీపై సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ 24 నుంచి మూడు రోజులపాటు గ్రామాల్లో బాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top