ఢిల్లీకి చేరనున్న రాజధాని భూ సమీకరణ సమస్య


జనవరి తొలివారంలో ఢిల్లీకి రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు

అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్‌ను కలవాలని నిర్ణయం


 

 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కృష్ణా నదీ పరీవాహక గ్రామాల రైతులు తమ సమస్యను జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారం, పది రోజుల్లో  ఈ గ్రామాల రైతులు, రైతు నాయకులు, రైతు హక్కుల కోసం పోరాడుతున్న వారు ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో నదీముఖ రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో వున్నారు. ఇందుకోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో సుమారు 53 వేల ఎకరాల వ్యవసాయ భూములు సమీకరించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏడాదికి 3, 4 పంటలు పండే తమ భూములు రాజధానికోసం లాగేసుకుంటే తాము బతకలేమనీ, పచ్చని పొలాలను వదిలేసి మెట్ట భూములు, ప్రభుత్వ, అటవీ భూముల్లో  రాజధాని నిర్మించుకోవాలని నదీ పరీవాహక గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

  తమకు ఎంత ప్యాకేజీ, పరిహారం ఇచ్చినా భూములు ఇచ్చేది లేదని వారు మంత్రులకు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కుని వాటితో వ్యాపారం చేసి ప్రభుత్వం రాజధాని నిర్మించడం ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోకుండా భూములు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో నదీ పరీవాహక గ్రామాల రైతులు, రైతు నాయకులు, రైతు హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకుని పోవాలని నిర్ణయించారు.

 

 లోక్‌సభ, రాజ్యసభలో అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు, అపాయింట్‌మెంట్ ఇస్తే ప్రధాని నరేంద్రమోడి, మంత్రులు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చటి భూములను నాశనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని విన్నవించాలని నిర్ణయించినట్లు కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ‘సాక్షి’కి చెప్పారు. దీంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్‌ను కూడా కలసి తమ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరబోతున్నట్లు తెలిపారు. జనవరి తొలివారంలో పర్యావరణవేత్త మేథాపాట్కర్ తుళ్లూరు మండలంలో పర్యటిస్తారని, జాతీయ మీడియాను కూడా తుళ్లూరుకు తీసుకుని రానున్నట్టు ఉద్యమ నాయకులు వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top