ప్రజాభిప్రాయం మేరకే రాజధాని ఏర్పాటు చేయాలి


తిరుపతి : రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని పుంగనూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అస్మదీయులకు ప్రయోజనం చేకూర్చేందుకే చంద్రబాబు విజయవాడ-గుంటూరు మధ ్య రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారన్నారు.



రాజధాని ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాలు, ఆలోచన లతో నిమిత్తం లేకుండా ముందుగానే నిర్ణయం తీసుకుని తన అనుయాయుల చేత తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించారన్నారు. నియంతృత్వ పోకడలకు పోతున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదన్నారు. రుణ మాఫీపై చంద్రబాబు దగాకోరు విధానాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రైతులు, మహిళలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.



రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమన్నారు. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలలో కేవలం 35 వేల కోట్లు మాత్రమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు, ఇది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు. అంతా మేలు చేసేసినట్లు మైండ్‌గేమ్ ఆడి ఎన్నికల హామీల నుంచి తప్పుకుని ప్రజల చూపును మళ్లించే యత్నం చేస్తున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు.



చంద్రబాబు స్పందించేలోపు పుణ్యకాలం దాటిపోయిందని ఖరీఫ్ అదను దాటిపోవడంతో రైతులు రుణాలు మాఫీ కాక, క్రాప్ సబ్సిడీ, ఇన్‌పుట్  సబ్సిడీ వంటివి పొందే వీలు కోల్పోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు. రుణాల రీషెడ్యూలింగ్‌పై ఆర్‌బీఐ సైతం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదని బ్యాంకులు రైతులకు, డ్వాక్రా గ్రూపులకు నోటీసులు పంపి రుణ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎన్నికలు ముగిసి ఏదో విధంగా అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top