రాజశేఖరరెడ్డి వంటి పాలన అందించే దమ్ముందా?:వైఎస్ జగన్

వైఎస్ జగన్మోహన రెడ్డి - Sakshi


హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి పాలన అందించ దమ్ముందా అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని  వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు.  అసెంబ్లీ కమిటీ హాలులో ఈ మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ శాసనసభలో దివంగత నేత రాజశేఖర రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు.  రాజశేఖర రెడ్డి పాలనలో మాదిరిగా కులమతాలకు అతీతంగా, పారదర్శికంగా, ప్రజా సంక్షేమా కార్యక్రమాలను చేపట్టే దమ్ము ఉందా అని  చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన మాదిరిగా ప్రజలపై భారం మోపకుండా, చార్జీలు పెంచకుండా ఉండగలరా అని అడిగారు. ఈరోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పాత బకాయిలు చెల్లిస్తే తప్ప బ్యాంకుల దగ్గరకు వెళ్లలేని దుస్థితి ఉందన్నారు. రైతులు బయట రెండు రూపాయిల వడ్డీతో రుణాల కోసం తిరుగుతున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ లేదా బీమా అందించి ఆదుకుందా? అని ప్రశ్నించారు.



ప్రజల దగ్గరకు వెళ్లి ఆయా గ్రామాల్లో వారి అవసరాలు తెలుసుకోవాలన్నారు. ప్రజలు వద్దని చెప్పినా ప్రభుత్వం ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందని అడిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు భిన్నంగా వ్యవహరించడం తగదన్నారు. గిరిజనులు వద్దంటున్నా బాక్సైట్ తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దీని వల్ల ఆ ప్రాంతంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగే అవకాశముందని హెచ్చరించారు.



చంద్రబాబు మూడు నెలల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దారుణంగా చంపేస్తున్నారని విమర్శించారు. ఓ వైపు శాసనసభలో శాంతిభద్రతలపై చర్చ జరుగుతుండగానే అనంతపురం జిల్లాలో హత్యలు జరిగాయని తెలిపారు. అధికారమన్నది శాశ్వతం కాదని హెచ్చరించారు. ఇవాళ అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉంటారని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించడం ముఖ్యం అని హితవు పలికారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top