బోస్‌కు పదవి కేడర్‌కు గౌరవం


ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ రెండున జిల్లాకు రానున్న వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఘనస్వాగతం పలకాలని పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. అదే రోజుద్రాక్షారామలో జరిగే సన్మానసభను విజయవంతం చేయాలన్నారు. సోమవారం స్థానిక జగదీశ్వరీ హోటల్‌లలో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన కుడుపూడి మాట్లాడుతూ మంత్రి పదవిని సైతం వదులుకుని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి వెన్నంటి నిలిచిన బోస్‌కు ఎమ్మెల్సీ పదవినివ్వడం పార్టీ కేడర్‌ను గౌరవించడమేనన్నారు. జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బోస్‌కు రావులపాలెం వద్ద ఘనస్వాగతం పలికి, రామచంద్రపురం నియోజకవర్గం వరకూ భారీ ర్యాలీగా తోడ్కొని వెళ్లాలన్నారు.

 

 బోస్‌కు పదవితో పార్టీ బలోపేతం..

 ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ బోస్‌కు ఎమ్మెల్సీ పదవి ద్వారా పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ  వైఎస్ కుటుంబం కోసం మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులకున్న బోస్‌కు పద వి ఇచ్చి జగన్ సముచిత స్థానం కల్పించారన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ బోస్‌కు జిల్లాలోని పార్టీశ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలకాలన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ బోస్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా జగన్ జిల్లాకు సముచితస్థానం కల్పించారన్నారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్(బాబు), జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, నీటిసంఘం చైర్మన్  కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు, కె.గంగవరం ఎంపీపీ పెట్టాశ్రీనివాస్ మాట్లాడారు. రూరల్ కో ఆర్డినేటర్ ఆకులవీర్రాజు, రాష్ట్ర సేవాదళ్ ప్రధానకార్యదర్శి సుంకరచిన్ని, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్రకార్యదర్శులు కొమ్మిశెట్టి బాలకృష్ణ, భూపతిరాజు సుదర్శన్‌బాబు, వివిధ విభాగాల జిల్లా చైర్మన్లు సిరిపురపు శ్రీనివాస్, మండపాక అప్పనదొర, పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు.

 

 2న ఇదీ ఎమ్మెల్సీ బోస్ పర్యటన..

 వచ్చే నెల 2 నాటి ఎమ్మెల్సీ బోస్ పర్యటన వివరాలను కుడుపూడి  వెల్లడించారు. బోస్ హైదరాబాద్ నుంచి కార్లో మధ్యాహ్నం రెండు గంటలకు రావులపాలెం చేరుకుంటారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలుకుతారు. బోస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి ర్యాలీగా మండపేట, మాచవరం మీదుగా పసలపూడి చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి భారీ ర్యాలీతో ద్రాక్షారామ చేరుకుంటారు. భీమేశ్వస్వామిని దర్శించుకుంటారు. ఆలయ ఆవరణలో సాయంత్రం నాలుగు గంటలకు బోస్ సన్మానసభ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరుగుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top